TG DSC 2024 Exam: డీఎస్సీ పరీక్షలో సిత్రాలు! ఒకే ప్రశ్న మరో పేపర్‌లో.. మొత్తం 18 ప్రశ్నలు రిపీట్
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో లెక్కలేనన్ని తప్పులు దొర్లాయి. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు జరిపారు. మొత్తం 160 ప్రశ్నలకు పరీక్ష నిర్వహించగా.. ఒక్కో ప్రశ్నకు అర మార్కు కేటాయిస్తారు. పేపర్ లీకేజీలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తే ఒక విడతలో..
హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో లెక్కలేనన్ని తప్పులు దొర్లాయి. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు జరిపారు. మొత్తం 160 ప్రశ్నలకు పరీక్ష నిర్వహించగా.. ఒక్కో ప్రశ్నకు అర మార్కు కేటాయిస్తారు. పేపర్ లీకేజీలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తే ఒక విడతలో వచ్చిన ప్రశ్నలు మరో విడత క్వశ్చన్ పేపర్‌లో రిపీట్ అయ్యాయి. ఇలా సాంఘికశాస్త్రంలో 18 ప్రశ్నలు మరో రోజు జరిగిన అదే సబ్జెక్ట్ పరీక్షలో పునరావృతం అయ్యాయి. మరో సబ్జెక్టులో ఒకే పోస్టుకు ఒకే ప్రశ్న 2 సార్లు పునరావృతం అయ్యింది. ఈ మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) – తెలుగు మాధ్యమం పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో రెండు రోజులు అక్షరం మారకుండా ఒకే ప్రశ్నలు రావడం చర్చనీయాంశంగా మారింది. పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 10న ప్రాథమిక కీ విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
జులై 19వ తేదీ ఉదయం, 23వ తేదీ మధ్యాహ్నం (సెకండ్ షిఫ్ట్) పరీక్షల్లో వచ్చిన సాంఘికశాస్త్రం ప్రశ్నలు (ప్రశ్న సంఖ్య 113 నుంచి 130 వరకు) పునరావృతమయ్యాయి. ఇలా సాంఘిక శాస్త్రంలో మొత్తం18 ప్రశ్నలు అక్షరం కూడా మారకుండా రిపీట్ ఇచ్చారు. జులై 19వ తేదీ ఉదయం నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, ములుగు జిల్లాల అభ్యర్థులకు, జులై 23వ తేదీ మధ్యాహ్నం కొత్తగూడెం, హనుమకొండ, గద్వాల, కరీంనగర్, నాగర్‌కర్నూల్, మెదక్ జిల్లాల వారికి ఈ పరీక్షలు జరిగాయి. విచిత్రంగా కనీసం ప్రశ్న నంబర్‌లు కూడా మారకుండా యథావిధిగా ఇవ్వడం గమనార్హం. ఆప్షన్లు సైతం ఒకేరకంగా వచ్చాయి. అయితే మామూలుగా పరీక్షకు ముందు ప్రశ్నలు బయటికొస్తే.. పేపర్ లీకేజీగా పరిగణిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక బయటికొస్తే పేపర్ ఔట్‌గా పరిగణిస్తారు. అయితే జులై 23వ తేదీ పరీక్ష ప్రారంభానికి ముందే 18 ప్రశ్నలు బయటకు రావడాన్ని పేపర్ లీకేజీగా పరిగణించాలని అభ్యర్ధులు ఆందోళన చేస్తున్నారు. ఇవేకాకుండా మరికొన్ని రకాల తప్పులు కూడా చోటుచేసుకున్నాయి. జులై 30వ తేదీ ఉదయం జరిగిన పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ తెలుగు మాధ్యమం పరీక్షలో.. ‘కిందివాటిలో ఏది సరైనది’ అని ఆంగ్లంలో ప్రశ్నను అడగగా.. తెలుగు అనువాదంలో మాత్రం ‘ఏది సరైనది కాదు’ అని అడిగారు. ఆరు ప్రశ్నలు అదేవిధంగా ఉన్నాయి. ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల వారికి ఆరోజు పరీక్ష జరిగింది. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు.
తాజా ఆరోపణలపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. 18 ప్రశ్నలు పునరావృతమైన విషయం మా దృష్టికి వచ్చింది. అయితే ఒక జిల్లాలో రాసినవారు మరో జిల్లాలో పరీక్ష రాసే ఛాన్స్ లేదు. పైగా ఇది ఆన్‌లైన్ పరీక్షలు అయినందున ప్రశ్నపత్రంలో ఏ ప్రశ్నలు వచ్చాయో ఇతరులకు తెలిసే అవకాశం లేదు. అందువల్ల ఇది పేపర్ లీకేజీ అయినట్లు కాదు. అభ్యర్థులకు ఎటువంటి నష్టం ఉండదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రశ్నల పునరావృతం ఎలా జరిగిందో విచారణ జరుపుతామని ఆయన అన్నారు.