ఇదెక్కడి విడ్డూరం.. షుగర్, బీపీ ఉంటే కూడా అమెరికా వీసా ఇవ్వరా? ఎందుకిలా?
వలసదారులకు స్వర్గధామంగా ఉన్న అమెరికా, ఇప్పుడు ఆరోగ్య సమస్యలపై కొత్త వీసా ఆంక్షలు విధించింది. మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి తీవ్ర అనారోగ్యాలు ఉన్నవారికి వీసాలు తిరస్కరించబడతాయి. అమెరికా పౌరుల ఆరోగ్య సంరక్షణ వ్యయం భారం తగ్గించుకోవడమే దీని వెనుక ప్రధాన కారణం.

వలసదారులకు స్వర్గధామంగా ఉన్న అమెరికా ఇప్పుడు విదేశీయులపై వరుస ఆంక్షలు విధించబోతోంది. H1B వీసాలపై ఆంక్షలు విధించిన తర్వాత అమెరికా ఇప్పుడు ఇతర వీసాలపై కూడా వివిధ ఆంక్షలు విధించింది. మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విదేశీ పౌరులకు వీసాలు జారీ చేయకూడదని నిర్ణయించింది. ఇది అమెరికా ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలలో ఉంది. వివిధ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
అమెరికా వీసాల అభ్యర్థులు ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలనేది చాలా కాలంగా ఉన్న నియమం. అయితే వీసా మార్గదర్శకంలో ఎక్కడా దాని గురించి ప్రస్తావించలేదు. చిన్న ఆరోగ్య సమస్యలను విస్మరించి వీసా మంజూరు చేయడం ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు మార్గదర్శకాలలో ఇది స్పష్టంగా ప్రస్తావించడంతో ఎంబసీ అధికారులు దరఖాస్తుదారుడి ఆరోగ్య సమస్యను తీవ్రంగా పరిగణించి వీసా దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది.
అమెరికా ప్రభుత్వం తన నివాసితుల ఆరోగ్య సంరక్షణ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తుంది. ప్రభుత్వం సబ్సిడీతో కూడిన బీమా పథకాలు ఉన్నాయి. అందువల్ల ప్రజల ఆరోగ్య సమస్యలు పెరిగితే, ప్రభుత్వంపై ఖర్చు భారం పెరుగుతుంది. ఈ కారణంగా అనారోగ్యంతో ఉన్న వలసదారులను రానివ్వకుండా ఉండాలని అమెరికా నిర్ణయించుకుని ఉండవచ్చు.
దరఖాస్తుదారుడి ఆరోగ్యాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవాలి. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధి, క్యాన్సర్, మధుమేహం, న్యూరోపతి, మానసిక ఆరోగ్యం వంటి వైద్య సమస్యలు ఉన్నవారిని చూసుకోవడానికి వేల డాలర్లు ఖర్చవుతాయి. ఊబకాయం ఉబ్బసం, బిపి మొదలైన వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి దానిని కూడా తనిఖీ చేయండి అని కొత్త యుఎస్ వీసా మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
