AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill : అందుకే ఓడిపోయాం.. పంజాబ్ చేతిలో పరాజయంపై శుభ్‌మన్ గిల్ హాట్ కామెంట్స్

Shubman Gill : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపై గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించారు. బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణమని, స్కోరు సరిపోలేదని గిల్ విశ్లేషించారు. ఈ పిచ్ 210 నుంచి 220 పరుగులు చేయదగ్గది. కనీసం 175 పరుగులైనా వస్తాయని ఆశించానని అన్నారు.

Shubman Gill : అందుకే ఓడిపోయాం.. పంజాబ్ చేతిలో పరాజయంపై శుభ్‌మన్ గిల్ హాట్ కామెంట్స్
Shubman Gill (2)
Rakesh
|

Updated on: Apr 01, 2026 | 11:29 AM

Share

Shubman Gill : ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూసింది. ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగిన ఈ పోరులో 3 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించగా, గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన జట్టు ప్రదర్శనపై పెదవి విరిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన గిల్, తాము ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయామని, అదే ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషించాడు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో ఆఖరి ఓవర్లలో తడబడటం జట్టుపై ప్రభావం చూపిందని గిల్ అభిప్రాయపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనిపై గిల్ స్పందిస్తూ.. “నిజానికి ఈ పిచ్ 210 నుంచి 220 పరుగులు చేయదగ్గది. మేము కనీసం 175 పరుగులైనా వస్తాయని ఆశించాం. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు, ఆఖరి ఐదు ఓవర్లలో అస్సలు పరుగులు రాలేదు. బంతి పాతబడే కొద్దీ షాట్లు ఆడటం కష్టంగా మారింది. జోస్ బట్లర్ (38), నేను (39) మంచి ఆరంభాన్ని ఇచ్చినా, దాన్ని భారీ స్కోరుగా మలచడంలో మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు” అని గిల్ వాపోయాడు.

బౌలర్ల వెనకే నిలిచిన కెప్టెన్

పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినప్పటికీ, గిల్ తన బౌలర్లను సమర్థించాడు. రెండో ఇన్నింగ్స్ సమయంలో కురిసిన జల్లుల వల్ల బంతి తడిగా మారిందని, దానివల్ల బౌలింగ్ చేయడం కష్టమైందని చెప్పాడు. ప్రసిద్ధ్ కృష్ణను ఆలస్యంగా ఎందుకు దించారన్న ప్రశ్నకు బదులిస్తూ.. “ప్రసిద్ధ్ సరైన సమయంలోనే బౌలింగ్‌కు వచ్చాడు. అతను వికెట్లు తీసి మమ్మల్ని 18వ ఓవర్ వరకు మ్యాచ్‌లో నిలబెట్టాడు. నెట్స్‌లో కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మ్యాచ్ పరిస్థితుల ప్రకారమే మార్పులు చేశాం” అని గిల్ వివరించాడు.

యంగ్ గన్ అశోక్ శర్మపై ప్రశంసలు

ఓటమి బాధలో ఉన్నా, యువ బౌలర్ అశోక్ శర్మ ప్రతిభను గిల్ మెచ్చుకోవడం విశేషం. అశోక్ శర్మ ఈ టీమ్‌కు దొరికిన ఒక గొప్ప ఆస్తి అని గిల్ కొనియాడాడు. “అశోక్ తన ఆట కోసం చాలా కష్టపడతాడు. కొన్ని నెలల క్రితం ఒక క్యాంప్‌లో అతడిని కలిసినప్పుడే అతని టాలెంట్ నాకు అర్థమైంది. ఈ రోజు అతను బాగా బౌలింగ్ చేశాడు. భవిష్యత్తులో కూడా ఇదే జోరు కొనసాగిస్తాడని ఆశిస్తున్నాను” అని గిల్ పేర్కొన్నాడు. జట్టు ఓడినా ఆటగాళ్ల స్పూర్తి మాత్రం తగ్గలేదని, రాబోయే మ్యాచుల్లో బలంగా పుంజుకుంటామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.

వైఫల్యాల నుంచి పాఠాలు

గుజరాత్ టైటాన్స్ లాంటి బలమైన జట్టు ఇంత తక్కువ స్కోరుకే పరిమితం కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వేసిన ప్లాన్ల ముందు గిల్ సేన చిక్కుకుపోయింది. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో గుజరాత్ బ్యాటర్లు తడబడ్డారు. అయితే, లీగ్ ఇంకా ఆరంభ దశలోనే ఉంది కాబట్టి, ఈ తప్పులను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన చేస్తామని శుభ్‌మన్ గిల్ హామీ ఇచ్చాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us