UAN activation: యూఏఎన్ నంబర్ యాక్టివేషన్ చేశారా..? జనవరి 15 వరకే అవకాశం
దేశంలోని ఉద్యోగుల సంక్షేమం కోసం, యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారికి అండగా నిలుస్తోంది. దీనిలో భాగంగా 2024లో ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ లో ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకాన్ని తీసుకువచ్చింది. దీనినే ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం అని కూడా పిలుస్తారు.
ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చడం ఈపీఎఫ్ఓ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఉద్యోగులు తమ యూఏఎన్ నంబర్ ను యాక్టివేట్ చేసుకోవడం, బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్ తో లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఈ పనులు చేయడానికి గడువును వచ్చే ఏడాది జనవరి 15 వరకూ పొడిగించారు. ప్రతి ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉంటుంది. దీన్నే పీఎఫ్ ఖాతా అని పిలుస్తారు. ఉద్యోగి జీతంలోని కొంత మొత్తం ప్రతినెలా దీనిలో జమ అవుతుంది. దానికి సమానమైన మొత్తాన్ని యజమాని కూడా జమ చేస్తాడు. ఉద్యోగి రిటైర్మెంట్ అనంతరం పెద్ద మొత్తంలో డబ్బు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి నెలా పింఛన్ రూపంలో డబ్బులు అందజేస్తారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో) నిర్వహణలో పీఎఫ్ ఖాతాలు కొనసాగుతాయి.
ప్రతి పీఎఫ్ ఖాతాదారుడికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఉంటుంది. దీని ద్వారా ఖాతా లావాదేవీలు పారదర్శకంగా జరుగుతాయి. కాబట్టి ఈ నంబర్ ను ఖాతాదారులందరూ తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవాలి. ఆన్ లైన్ లో పీఎఫ్ ను ఉపసంహరించుకోవడం, బ్యాలెన్స్ ను తనిఖీ చేయడం తదితర వాటిని చేయడానికి యూఏఎన్ నంబర్ చాలా కీలకంగా ఉంటుంది. ఈపీఎఫ్ వో నుంచి ప్రతి నెలా పీఎఫ్ ఖాతాదారుడి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. దానికోసం అతడి బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్ తో తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలన్నీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) స్కీమ్ ద్వారా జరుగుతున్నాయి. దాని ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్ తో లింక్ చేయడం తప్పనిసరి. తద్వారా ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతాయి.
ఈఎల్ఐ పథకంలో భాగంగా మొదటి సారి ఉద్యోగులు స్కీమ్ ఏ కింద వేతన రాయితీలు పొందుతారు. బీ, సీ స్కీముల ద్వారా కొత్త ఉద్యోగుల నియామకానికి యజమానులను ప్రోత్సహం అందిస్తారు. దీని ద్వారా పరోక్షంగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే 2 మిలియన్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, పది మిలియన్ల యువకులకు ఇంటర్న్ షిప్ అందించడం తదితర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం పథకం ప్రయోజనాలను పొందటానికి ఉద్యోగులు తప్పనిసరిగా యూఏఎన్ నంబర్ ను యాక్టివేట్ చేసుకోవాలి, అలాగే బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ ను అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే ఈ పథకం ప్రయోజనాలను నేరుగా పొందే అవకాశం ఉంటుంది. దీని కోసమే జనవరి 15వ తేదీ వరకూ గడువు కల్పించారు. గతంలో విడుదల చేసిన సర్క్యూలర్ ప్రకారం డిసెంబర్ 15తో ఈ గడువు ముగిసిపోయింది. దీంతో మరో నెల రోజులు పొడిగిస్తు ఉత్తర్వులు విడుదలయ్యాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి