కొత్త టీవీ కొనాలని చూస్తున్నారా.? వెంటనే కొనేయండి.. లేదా మీకో షేకింగ్ న్యూస్..
ఎల్‌ఈడీ టీవీ ధరలు కనీసం 3 శాతం వరకు పెరుగుతాయని హయర్ ఇండియా అధ్యక్షుడు ఎన్ఎస్ సతీష్ తెలిపారు. ఇప్పటికే కొన్ని బ్రాండ్లు డీలర్లకు ధరల పెంపుపై సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు, థామ్సన్, కోడక్, బ్లూపంక్ట్ వంటి బ్రాండ్ల టీవీలను తయారు చేసే..

కొత్త ఏడాది ప్రారంభం నుంచే ఎల్‌ఈడీ టీవీల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో మెమరీ చిప్‌ల కొరత తీవ్రంగా ఉండటంతో పాటు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం టీవీ తయారీ కంపెనీలపై భారంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే నెల నుంచి టీవీ ధరలు సగటున 3–4 శాతం వరకు పెరగనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్‌ఈడీ టీవీల తయారీలో అవసరమైన భాగాల్లో కేవలం 30 శాతం మాత్రమే దేశీయంగా లభిస్తున్నాయి. మిగిలిన దాదాపు 70 శాతం పార్టులు దిగుమతుల ద్వారానే రావాల్సి వస్తోంది. ఓపెన్ సెల్, సెమీకండక్టర్ చిప్స్, మదర్‌బోర్డ్‌లు వంటి కీలక భాగాలన్నీ విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90కి పైగా పడిపోవడంతో దిగుమతి ఖర్చులు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత నెలకొంది. ఏఐ సర్వర్లు, డేటా సెంటర్లకు అవసరమైన హై బ్యాండ్‌విడ్త్ మెమరీ చిప్‌లపై తయారీదారులు ఎక్కువగా దృష్టి పెట్టడంతో టీవీలకు అవసరమైన డీఆర్‌ఏఎమ్, ఫ్లాష్ మెమరీ సరఫరా తగ్గింది. ఫలితంగా ఈ మెమరీ పార్టుల ధరలు గత కొన్ని నెలల్లో విపరీతంగా పెరిగినట్లు కంపెనీలు చెబుతున్నాయి.
కంపెనీల మాట ఇదే
ఎల్‌ఈడీ టీవీ ధరలు కనీసం 3 శాతం వరకు పెరుగుతాయని హయర్ ఇండియా అధ్యక్షుడు ఎన్ఎస్ సతీష్ తెలిపారు. ఇప్పటికే కొన్ని బ్రాండ్లు డీలర్లకు ధరల పెంపుపై సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు, థామ్సన్, కోడక్, బ్లూపంక్ట్ వంటి బ్రాండ్ల టీవీలను తయారు చేసే సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అవనీత్ సింగ్ మాట్లాడుతూ, మెమరీ చిప్ ధరలు గత మూడు నెలల్లోనే 500 శాతం వరకు పెరిగాయని చెప్పారు. ఈ పరిస్థితులు కొనసాగితే జనవరిలో టీవీల ధరలు 7–10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇటీవల 32 అంగుళాలకుపైగా ఉన్న టీవీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీని వల్ల అప్పట్లో టీవీ ధరలు రూ.4,500 వరకు తగ్గాయి. అయితే తాజా ధరల పెరుగుదలతో ఆ ప్రయోజనం పూర్తిగా వినియోగదారులకు చేరకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
వచ్చే ఏడాది జూన్ వరకూ ఒత్తిడే
డైవా బ్రాండ్‌తో పాటు రిలయన్స్, హావెల్స్, హ్యుందాయ్, తోషిబా, కాంపాక్ వంటి కంపెనీలకు ఒరిజినల్ డిజైన్ మాన్యుఫాక్చరింగ్ సేవలు అందిస్తున్న వీడియోటెక్స్‌పై కూడా ఈ పరిస్థితుల ప్రభావం పడింది. ఫ్లాష్, డీడీఆర్4 మెమరీ ధరలు 1,000 శాతం వరకు పెరిగాయని వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ వెల్లడించారు. ఏఐ డేటా సెంటర్ల వైపు సరఫరా మళ్లడంతో టీవీ పరిశ్రమకు కొరత ఏర్పడిందని ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితులు వచ్చే ఏడాది జూన్ వరకు కొనసాగొచ్చని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. మెమరీ చిప్‌ల సరఫరా మెరుగుపడితే ఆ తర్వాతే ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాత స్టాక్ అయిపోయిన తర్వాత టీవీలు కొత్త ధరలతోనే మార్కెట్లోకి వచ్చే పరిస్థితి ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్‌లో స్మార్ట్ టీవీ రవాణాలు ఏడాది ప్రాతిపదికన 4 శాతం తగ్గాయి. చిన్న స్క్రీన్ విభాగంలో డిమాండ్ తగ్గడం, వినియోగదారుల ఖర్చులు కుదించుకోవడం ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








