FD Interest Rates: ఎఫ్‌డీ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకులో ఎంతంటే..
కొన్ని బ్యాంకులు తమ టెర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఈ అక్టోబర్లోనే పలు బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రస్తుతం ఉన్న రేట్ల కన్నా కాస్త పెంచాయి. దీంతో సాధారణ వినియోగదారులతో పాటు సీనియర్ సిటిజెన్స్ కూడా భారీగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఏయే బ్యాంకుల్లో.. ఎంత మేర వడ్డీ పెరిగిందో ఓసారి తెలుసుకుందాం..
సురక్షిత పెట్టుబడి పథకాలలో ఫిక్స్ డ్‌డిపాజిట్లు ప్రథమ స్థానంలో ఉంటాయి. ఇవి అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలు. స్థిరమైన రాబడి వస్తుండటం దీనిలో ప్రధాన సానుకూలాంశం. ఈ పథకాన్ని బ్యాంకులతో పాటు పోస్టు ఆఫీసుల్లో కూడా ప్రారంభించే అవకాశం ఉంది. అయితే దీనిలో రిటర్న్స్ అన్ని చోట్ల ఒకేలా ఉండవు. ఒక్కో బ్యాంక్ లో ఒక్కో రకమైన వడ్డీ రేటు ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన ఆర్బీఐ ప్రత్యేక సమావేశంలో రెపో రేటును యథాతథంగా ఉంచడంతో కొన్ని బ్యాంకులు తమ టెర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఈ అక్టోబర్లోనే పలు బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రస్తుతం ఉన్న రేట్ల కన్నా కాస్త పెంచాయి. దీంతో సాధారణ వినియోగదారులతో పాటు సీనియర్ సిటిజెన్స్ కూడా భారీగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఏయే బ్యాంకుల్లో.. ఎంత మేర వడ్డీ పెరిగిందో ఓసారి తెలుసుకుందాం..
యూనిటీ బ్యాంక్.. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (యూనిటీ బ్యాంక్) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది . బ్యాంక్ ఇప్పుడు సీనియర్ సిటిజన్‌లకు 701 రోజులకు గానూ పెట్టుబడి పెట్టిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.45% వార్షిక వడ్డీని అందిస్తుంది. అయితే సాధారణ పెట్టుబడిదారులు అదే వ్యవధికి 8.95% వార్షిక వడ్డీని అందిస్తుంది. 1001 రోజుల డిపాజిట్లపై, యూనిటీ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 9.5%, ఇతరులకు 9% వడ్డీని అందిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఈ బ్యాంక్ ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ టర్మ్ డిపాజిట్లతో సహా దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. 3 సంవత్సరాల వరకు వివిధ కాల వ్యవధిల్లోని పథకాలకు ఇది వర్తింపజేస్తుంది. 2 నుంచి 3 సంవత్సరాల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.9% వరకు వడ్డీని అందిస్తోంది. తిరంగా ప్లస్ డిపాజిట్ పథకం కింద 399 రోజుల డిపాజిట్ల కోసం, సీనియర్ సిటిజన్లకు 7.8% వడ్డీని అందిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. ఈ బ్యాంక్ 46-90 రోజుల ఫిక్స్ డ్ డిపాజిట్లపై రేట్లను 125 బీపీఎస్ వరకు పెంచింది. ఈ స్వల్పకాలిక డిపాజిట్లపై గతంలో 3.50 శాతం ఉండగా ఇప్పుడు 4.75 శాతం ఆఫర్ చేస్తోంది.
కెనరా బ్యాంక్.. ఈ బ్యాంక్ తన ఎఫ్డీ రేట్లను సవరించింది. అక్టోబర్ 5 నుండి కొత్త రేట్లను అమలు చేస్తోంది. ఇది ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 7.75% వరకు వడ్డీని అందిస్తోంది.
యెస్ బ్యాంక్.. ఈ బ్యాంకు కూడా తన ఎఫ్ డీ రేట్లను సవరించింది. అక్టోబరు 4 నుంచి కొత్త రేట్లను అమలులోకి తెచ్చింది. యెస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 8% ఎఫ్డీ వడ్డీ రేటును అందిస్తోంది.
కర్నాటక బ్యాంక్.. ఈ బ్యాంకు కూడా తన సవరించిన ఎఫ్డీ రేట్లను అక్టోబర్ 1 నుంచి అమలులోకి తీసుకొచ్చింది. కర్ణాటక బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 7.75% ఎఫ్డీ వడ్డీ రేటును అందిస్తోంది.
ఇండస్ ఇండ్ బ్యాంక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రేట్లను అమలు చేస్తోంది. తన బ్యాంకులోని ఎఫ్ డీలపై సీనియర్ సిటిజన్లకు 8.25% వడ్డీ రేటును అందిస్తోంది.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్.. ఈ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 8% వడ్డీ రేటును అందిస్తోంది. కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈ బ్యాంకులో ఎఫ్ డీలపై 7.75శాతం వడ్డీ రేటు వస్తుంది. కొత్త రేట్లు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..