Stock Market: పుంజుకున్న సూచీలు, నష్టాలు కాస్త భర్తీ…మదుపర్లకు ఊరట
కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభిస్తుండటంతో మళ్లీ లాక్‌డౌన్ రావచ్చన్న భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కుదేలయ్యాయి. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా నష్టపోగా...మంగళవారం మదుపర్లకు కాస్త ఊరట లభించింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో మళ్లీ లాక్‌డౌన్ రావచ్చన్న భయాలు నెలకొంటున్నాయి. లాక్‌డౌన్ భయాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న(సోమవారం) భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా నష్టపోగా…మంగళవారం మదుపర్లకు కాస్త ఊరట లభించింది. స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి పుంజుకోవడంతో నష్టాలను మదుపర్లు కొంత మేరకు భర్తీ చేసుకున్నారు. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు…చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 48,500 పాయింట్లు, నిఫ్టీ 14,500 పాయింట్ల ఎగువునకు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 661 పాయింట్ల లాభంతో 48,544 పాయింట్ల దగ్గర ముగిసింది. అటు నిఫ్టీ కూడా 194 పాయింట్ల లాభంతో 14,505 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. నిన్న భారీగా నష్టపోయిన బ్యాంకింగ్, ఆటో షేర్లు మంగళవారం లాభాలు ఆర్జించాయి. మహీంద్ర అండ్ మహీంద్ర, బజాజ్ ఫినాన్స్ సర్వీస్, టాటా మోటార్స్, మారుతి సుజుకి షేర్లు 4 నుంచి 8 శాతం మేర లాభాలు ఆర్జించాయి.
సోమవారం భారీ నష్టాలతో దాదాపు రూ.8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయ్యింది. మంగళవారంనాటి లాభాలతో ఈ నష్టం కాస్త భర్తీ అయ్యింది. కొత్త వ్యాక్సిన్లకు ఆమోద ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయడం మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు ఆమోదం లభించడంతో దేశంలో మూడో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండటం తెలిసిందే. మరికొన్ని వ్యాక్సిన్లు కూడా కొన్ని మాసాల్లోనే దేశంలో అందుబాటులోకి రానున్నాయి.
అటు టీసీఎస్ నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలు మించడంతో పాటు మరన్ని కార్పొరేట్ కంపెనీల క్యూ4 ఫలితాలపై మార్కెట్లో సానుకూలత వ్యక్తమవుతోంది. ఈ అంశం కూడా మార్కెట్లో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పాయి.
ఇవి కూడా చదవండి..వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. విదేశీ టీకాల అనుమతి ఇచ్చే యోచన..?
బ్రిటన్‌లో కరోనా థర్డ్ వేవ్ భయాలు..50 వేల మందికి ‘ప్రాణ గండం’..వైద్య నిపుణుల హెచ్చరిక