AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Rate: వెండి ధరల ధగధగల ముందు బంగారం కూడా బేజారు..!

వెండి ధర దడ పుట్టిస్తోంది. వెండి ధరల ధగధగల ముందు బంగారం కూడా బేజారైపోతోంది. అసలు వెండే బంగారమాయెనా అనే డౌట్లొస్తున్నాయి. ఒకరోజు అందనంత ఎత్తుకు ఎదిగి.. మరుసటిరోజు అమాంతం పడిపోతోంది. వెండి మాయాబజార్ సంగతేంటో అర్థం కాక బులియన్ స్పెషలిస్టులే బుర్ర గోక్కుంటున్న పరిస్థితి. మరి... వెండి విషయంలో సగటు వినియోగదారుడి మైండ్‌సెట్ ఎలా ఉంది?

Silver Rate: వెండి ధరల ధగధగల ముందు బంగారం కూడా బేజారు..!
Silver
Ram Naramaneni
|

Updated on: Jul 18, 2025 | 8:05 PM

Share

గోల్డ్ ఈజ్ ఆల్వేస్‌ గోల్డ్. గోల్డు ఓల్డయ్యే సమస్యే లేదు. ఆర్నమెంట్ సెక్టార్‌లో పుత్తడికుండే ప్రయారిటీ ఎవర్‌గ్రీన్. కానీ.. ఇవాళారేపూ పసిడిమాతల్లి మధ్యతరగతికి దొరక్కుండా కొండెక్కి కూర్చుంది. ఇవాళ్టికివ్వాళ దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర బంగారం ధర 99 వేల 340 రూపాయలు. కొనబోతే కొరివిని తలపిస్తోంది. అందుకే మిడిల్‌క్లాసోడి నెక్ట్స్ ఛాన్స్‌గా మిగిలిందల్లా రజతమేగా! ఏదైనా శుభకార్యానికో, పర్వదినానికో కొనుక్కోవాలంటే వెండివైపే ఆశగా చూస్తున్నాడు సగటు కస్టమర్. కానీ.. ఆ వెండి కూడా అంత ఈజీగా దొరకనంటోంది.

ఇప్పటికిప్పుడు వెండి కిలో అక్షరాలా లక్షా 15 వేల 136 రూపాయలు. రెండురోజుల కిందట జూలై 16న దేశీయ సానుకూల పరిస్థితుల కారణంగా లక్షా 14 వేల దగ్గర క్లోజైన వెండి.. తర్వాతి రోజు లక్షా పాతిక వేలను టచ్ చెయ్యడంతో బంగారమే బిత్తరచూపులు చూసింది. మళ్లీ దిగొచ్చి లక్షా పదహారు వేల దగ్గర నిలబడింది రజత మాయ. కానీ.. పెరుగుతున్న డిమాండ్‌తో పాటే ధరల్లో కూడా వెండి దూసుకుపోవడం ఖాయం. ఇదే దూకుడు కంటిన్యూ ఐతే.. కిలో వెండి ధర లక్షా 40 వేల టచ్ చేసినా ఆశ్చర్యం లేదని, 2026 నాటికి కిలో వెండి రెండు లక్షలకు చేరుతుందని అంచనా కడుతోంది బులియన్ మార్కెట్.

వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడం చరిత్రలో ఇదే మొదటిసారి.గత ఏడాదితో పోల్చి చూస్తే వెండి ధర దాదాపు 30 నుంచి 40 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి బంగారానికి దీటుగా వెండి ధరలు కూడా పైపైకే చూస్తున్నాయి. వెండికి ఆభరణాల మార్కెట్‌తో పాటు.. పారిశ్రామిక ఉత్పత్తిలో కూడా డిమాండెక్కువ. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానల్స్, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలోనూ వెండిని వాడతారు. ఒక్క గ్రీన్‌ కార్‌ తయారవ్వాలంటే కనీసం 80 గ్రాములు వెండి కావాలి. మామూలు కారుకు 40 గ్రాముల సిల్వర్ అవసరం. పైగా.. వెండి ప్రొడక్షన్ తగ్గడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణం.

మొదట్లో వెండి మీద ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఎగబడ్డారు. సిల్వర్ ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మార్గంలో డిజిటల్‌ పెట్టుబడులు కూడా వెల్లువెత్తాయి. వెండిని పెట్టుబడి మార్గంగా భావించని కొందరైతే ప్లాన్‌బీ వైపు చూస్తున్నారు. లాంగ్‌రన్‌లో లాభాలొస్తాయన్న గ్యారంటీ లేకపోవడంతో.. వెండి వైపు చూడ్డం లేదు. అటు.. డొమెస్టిక్ యూజర్లు ఇంట్లో ఉండే పాత వెండిని బైటికి తీస్తున్నారు. వెండి చెంబులు, గిన్నెలు, కంచాలు, పూజా సామాగ్రి.. దేన్నీ ఉపేక్షించడం లేదు. 80 శాతం ధర వచ్చినా చాలంటూ తెగనమ్ముకోడానికి సిద్ధమౌతున్నారు కన్‌జ్యూమర్లు. మరీముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి పాత వెండి అమ్మకం చక్కటి ఆప్షన్ అవుతోంది. గుర్తింపు పొందిన జువెలరీ షాపుల్లో అమ్మడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కానీ.. రెండు లక్షల రూపాయలకు మించి విలువైన వెండిని అమ్మాలంటే పాన్ కార్డు డీటెయిల్స్ సమర్పించాల్సిందే. ఏదైతేనేం.. వెండి ధర సగటు వినియోగదారుడితో దోబూచులాడుతోంది. ఇదే స్థాయిలో పెరుగుతుందా లేక మందగిస్తుందా అర్థం కాని అయోమయం.. ప్రస్తుత వెండి ధరల మాయాజాలం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి