లక్ష దాటిన వెండి ధర..! బంగారంతో పోటీ పడే రోజులు దగ్గరల్లోనే..
వెండి ధరలు గణనీయంగా పెరిగి కిలో రూ.1 లక్షకు పైగా చేరాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రూపాయి బలహీనత వంటి కారణాల వల్ల ఈ పెరుగుదల సంభవించింది. యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం, వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉంది.

ఒకవైపు బంగారం ధర పెరుగుదల చూసి భయపడుతున్న వారికి మరోవైపు వెండి నేనేం తక్కువ కాదు అని చెబుతోంది. తాజాగా వెండి ధర గణనీయంగా పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేపో రేటు తగ్గింపు అంచనాలు పెరుగుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX )లో జూలై గడువు ముగియడంతో వెండి భవిష్యత్ ఒప్పందాలు 2 శాతానికి పైగా పెరిగి తొలిసారిగా కిలోకు రూ.1.09 లక్షల కీలక స్థాయిని దాటాయి. ఆగస్టు నెల గడువు ముగిసే ఫ్యూచర్స్ కాంట్రాక్టులు బుధవారం MCXలో కిలోకు రూ.1,09,250 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి.
అవి వాటి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి అయిన కిలోకు రూ.88,050 నుండి దాదాపు 24 శాతం పెరిగాయి. సెప్టెంబర్ నెల గడువు ముగిసే ఫ్యూచర్ కాంట్రాక్టులు కూడా ఈ రోజు కిలోకు రూ.1,10,420 వద్ద కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. దేశీయ మార్కెట్లో ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇన్వెస్టర్‌గెయిన్ డేటా ప్రకారం.. భారత్‌లో వెండి సగటు ధర కిలోకు రూ.1,10,000గా ఉంది.
ముఖ్యంగా చమురు సంపన్న మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా వెండి ధరల పెరుగుదలకు కారణం కావచ్చు. రూపాయి బలహీనత బంగారం, వెండి ధరలకు కూడా మద్దతు ఇవ్వవచ్చు. డాలర్ ఇండెక్స్‌లో అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఈ వారం బంగారం, వెండి ధరలు అస్థిరంగా ఉంటాయని పృథ్వీ ఫిన్‌మార్ట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ జైన్ ఇటీవల అన్నారు. యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం.. వెండి ధర రూ.107,400 కంటే మరింత పెరిగి రూ.1,11,000, రూ.1,13,000 కు వెళ్తుందని అంచనా వేసింది. ఇలా వెండి ధర పెరుగుతూ పోతే భవిష్యత్తులో బంగారం ధరతో కూడా పోటీ పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




