AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Prices: వెండి ధరల విషయంలో ఊహించని పరిణామం.. త్వరలో మరో బాంబ్..

దేశంలో వెండి ధరలు పెరగనున్నాయా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తన్నాయి. దీనికి కారణం ఏంటంటే.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెండిపై పలు ఆంక్షలు విధించడమే. కొత్త ఆంక్షల వల్ల వెండికి కొరత ఏర్పడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంతో ధరలు పెరగవచ్చు.

Silver Prices: వెండి ధరల విషయంలో ఊహించని పరిణామం.. త్వరలో మరో బాంబ్..
Silver
Venkatrao Lella
|

Updated on: Jun 04, 2026 | 7:27 PM

Share

బంగారం, వెండి కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో ప్రకటన చేయగా.. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వెండి దిగుమతులపై కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. రూపాయి బలహీనపడటం, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పడుతుండటంతో సిల్వర్ దిగుమతులను అరికట్టేందుకు పలు ఆంక్షలు విధించింది. వెండి రేణువులు, పొడుల దిగుమతులను నియంత్రిత వర్గంలో చేర్చింది. అంటే ఇక నుంచి వీటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

పెరిగిన వెండి దిగుమతులు

99.9 శాతం స్వచ్చత కలిగిన వెండి పొడి, రేణువులు, పాక్షికంగా తయారైన ఉత్పత్తులను విదేశాల నుంచి భారత దిగుమతిదారులు తెచ్చుకోవాలంటే ముందుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి లైసెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. గత నెలలో వెండి కడ్డీలు, సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్‌ను ఈ జాబితాలోకి తీసుకురాగా.. ఇప్పుడు మరికొన్ని ఉత్పత్తులను కూడా చేర్చింది. దేశంలో వెండి దిగుమతులు భారీగా పెరిగిపోయాయి. ప్రపంచంలోనే అత్యధికంగా వెండిని వినియోగించే దేశంగా భారత్ ఉండగా.. రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకుంటుంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.1.20 లక్షల కోట్లు దిగుమతుల కోసం ఖర్చు చేసింది. ఇక ఏప్రిల్‌లో వెండి దిగుమతులు 157 శాతం పెరిగినట్లు ఆర్థికశాఖ చెబుతోంది.

వెండి ధరలు పెరుగుతాయా..?

వెండిపై కేంద్రం ఇటీవల దిగుమతి సుంకాలను పెంచింది. ఇప్పుడు రేణువులు, పొడిపై కూడా ఆంక్షలు విధించడంతో వీటికి కొరత ఏర్పడే అవకాశముంటుంది. దీని ప్రభావంతో వెండి ధరలు భవిష్యత్తులో పెరిగే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయాల వల్ల తక్షణమే వెండి ధరలు పెరగవచ్చని అంటున్నారు. అనుమతి తీసుకునేందుకు చాలా సమయం పడుతుంది. దీని వల్ల వెండి సరఫరా తగ్గడంతో పాటు తాత్కాలిక కొరత ఏర్పడుతుంది. దీని వల్ల ధరలు పెరుగుతాయని అంటున్నారు. ఇక వెండిని ముడి సరుకుగా ఎక్కువగా ఉపయోగించే సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలపై కూడా దీని ప్రభావం పడుతుందని చెబుతున్నారు. వెండిని నాణేలు, కడ్డీలు, పూజా సామాగ్రికి మాత్రమే కాకుండా పరిశ్రమ అవసరాల కోసం కూడా ఉపయోగిస్తారు. దీంతో వెండికి దేశంలో డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.90 లక్షల వద్ద కొనసాగుతోంది. గతంలో రూ.4 లక్షల వద్దకు చేరుకోగా.. ప్రస్తుతం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Follow Us