RBI: సైబర్ మోసంలో డబ్బులు కోల్పోయారా..? ఆర్బీఐ పెద్ద ఊరట.. ఈ మార్గాల్లో తిరిగి రీఫండ్ పొందవచ్చు..
ఇటీవల దేశంలో నైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఆర్బీఐ కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తోంది. బాధితులకు రీఫండ్ అందేలా చేసేందుకు ఆర్బీఐ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను సిద్దం చేసింది. దీని ప్రకారం త్వరగా ఫిర్యాదు చేస్తే బాధితులు తాము పొగోట్టుకున్న సొమ్మును తిరిగి పొందవచ్చు.

దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో సైబర్ నేరగాళ్లు వివిధ పద్దతుల్లో బ్యాంక్ అకౌంట్లోని సొమ్మును కాజేస్తున్నారు. ఫిషింగ్ లింకులు, నకిలీ కాల్స్, మాల్వేర్, యాప్ ఆధారిత మోసాల ద్వారా బురిడీ కొట్టిస్తున్నారు. ఇక హ్యాక్ చేయబడిన యూపీఐ ఖాతాల నుండి కార్డ్ స్కిమ్మింగ్, రిమోట్ యాక్సెస్ అప్లికేషన్ల వరకు మోసగాళ్లు బ్యాంకు ఖాతాలలోకి ప్రవేశించడానికి కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటూనే ఉన్నారు. దీంతో సైబర్ మోసాలకు గురైన బాధితులకు త్వరతగతి సాయం అందించడం, డబ్బులను తిరిగి పొందేలా చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వినియోగదారుల కోసం అనేక నిబంధనలు ప్రవేశపెట్టింది. అయితే పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అంశం వినియోగదారులు ఎంత త్వరగా, సరిగ్గా స్పందిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. రీఫండ్ ప్రక్రియను అర్థం చేసుకోవడం, డబ్బులు పోయని వెంటనే తక్షణ చర్య తీసుకోవడం వల్ల లాభం జరుగుతుంది.
డబ్బులు మాయమైతే ఏం చేయాలి..?
మీ అనుమతి లేకుండా మీ నుండి డబ్బు మాయమైతే మొదటి కొన్ని నిమిషాలు, గంటలలో ఏమి చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. డిజిటల్ బ్యాంకింగ్ మోసం జరిగిన తర్వాత వేగంగా స్పందించడం, మోసాన్ని నివేదించడం, మీ బ్యాంక్ అకౌంట్లను సురక్షితంగా ఉంచుకోవడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు. మీరు వెంటనే అప్రమత్తమైతే బ్యాంకులు మోసపూరిత లావాదేవీలలో కోల్పోయిన డబ్బును తిరిగి ఇవ్వవచ్చు. జరిగిన పరిస్థితులు, వినియోగదారుడు వేగంగా ఫిర్యాదు చేసిన అంశాలకు అనుగణంగా రీఫండ్ చేయవచ్చు.
ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకు నిర్లక్ష్యం, సిస్టమ్ వైఫల్యం లేదా థర్డ్ పార్టీ ఉల్లంఘన కారణంగా మోసం జరిగితే రీఫండ్ పొందవచ్చు. డబ్బులు కోల్పోయినప్పుడు వినియోగదారుడి పాత్ర లేనట్లయితే ఐదు రోజుల్లోగా సమాచారం అందించాలి. పోయిన డబ్బుకు వినియోగదారులకు ఎలాంటి బాధ్యత ఉండదు. అటువంటి పరిస్థితులలో బ్యాంకు రీఫండ్ అందించాల్సి ఉంటుది. వినియోగదారులు నాలుగు నుండి ఏడు రోజులలోపు మోసం గురించి చెబితే.. వారు పరిమిత బాధ్యతను ఎదుర్కోవలసి రావచ్చు. వినియోగదారుడు బాధ్యత వహించాల్సిన మొత్తం ఖాతా స్వభావం, లావాదేవీ రకంపై ఆధారపడి ఉంటుంది. ఓటీపీ,పిన్,సీవీవీ పంచుకోవడం లేదా అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయడం వంటి కస్టమర్ నిర్లక్ష్యం వల్ల మోసం జరిగితే రీఫండ్ పొందే అవకాశాలు తీవ్రంగా తగ్గిపోతాయి. ఫిర్యాదు చేయడంలో ఆలస్యం కూడా కస్టమర్ బాధ్యతను పెంచుతుంది. అనధికార లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను, ఫిర్యాదు అందిన 90 రోజులలోపు బ్యాంకులు పరిష్కరించాల్సి ఉంటుంది. బ్యాంకుకు తెలియజేసిన తర్వాత బాధితులు 1930 అనే సైబర్ ఫ్రాడ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.ఈ సంఘటనను సైబర్ క్రైమ్ అధికారులకు నివేదించడం వల్ల డబ్బు మరింత ముందుకు తరలించబడక ముందే అధికారులు మోసపూరిత లావాదేవీలను నిలిపివేయడానికి సహాయపడవచ్చు. సకాలంలో జోక్యం చేసుకోవడం తరచుగా నిధులను తిరిగి పొందే అవకాశాలను మెరుగుపరుస్తుంది.
