Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఆ నాలుగు యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవద్దంటున్న ఎస్బీఐ.. అవి ఏమిటి.. ఎందుకో తెలుసుకోండి!

ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో.. ఎస్బీఐ తన కష్టమర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తోంది. తాజాగా ఎస్బీఐ తన కష్టమర్లను మొబైల్ ఫోన్లలో నాలుగు యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచించింది.

SBI: ఆ నాలుగు యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవద్దంటున్న ఎస్బీఐ.. అవి ఏమిటి.. ఎందుకో తెలుసుకోండి!
Sbi
Follow us
KVD Varma

|

Updated on: Sep 08, 2021 | 1:27 PM

SBI: ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో.. ఎస్బీఐ తన కష్టమర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తోంది. తాజాగా ఎస్బీఐ తన కష్టమర్లను మొబైల్ ఫోన్లలో నాలుగు యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచించింది. ఎనీడెస్క్‌, క్విక్‌సపోర్ట్‌, టీమ్‌వ్యూయర్‌, మింగిల్‌వ్యూ యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని తన వినియోగదార్లకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చెబుతోంది. ఈ నాలుగు యాప్‌లతో ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా కొందరు మోసగాళ్లు మాయమాటలు చెప్పి మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. వాళ్లు చెప్పిన మాట విని వాటిని ఇన్‌స్టాల్‌ చేసుకోవడం వల్ల, గత నాలుగు నెలల్లో 150 మంది ఎస్బీఐ వినియోగదార్లు మొత్తంగా రూ.70 లక్షలు నష్టపోయారని ఎస్బీఐ తెలిపినట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. ఈ తరహా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 యాప్‌లను ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని ఖాతాదార్లకు ఎస్‌బీఐ సూచన చేసింది.

యూపీఐ ప్లాట్‌ఫాంలను ఉపయోగించేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ తెలిపింది. మీకు తెలియని నెంబర్ల నుంచి క్యూఆర్‌ కోడ్‌ లేదా యూపీఐ కలెక్ట్‌ రిక్వెస్ట్‌ వస్తే వాటిని తిరస్కరించాలని తెలిపింది. ఎస్బీఐ పేరుతో పలు నకిలీ వెబ్‌సైట్‌లు ఉన్నాయని, తమ హెల్ప్‌లైన్‌ లేదా కస్టమర్‌ కేర్‌ నెంబర్లను వెతికేటప్పుడు అలాంటి వెబ్‌సైట్‌ల జోలికి వెళ్లకూడదని హెచ్చరించింది. ‘ఏ సమస్య పరిష్కారం కోసమైనా మా అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించండి అని ఎస్బీఐ సూచిస్తోంది.

మీరు వాడే వెబ్‌సైట్‌ సరైనదే అని నిర్థరణకు వచ్చాకే, మీ వివరాలు తెలియజేయండని ఖాతాదార్లకు ఎస్బీఐ చెబుతోంది. డిజిటల్‌ లావాదేవీ పూర్తయ్యాక వినియోగదారుకి ఒక ఎస్‌ఎమ్‌ఎస్‌ వస్తుందని, ఒకవేళ ఆ లావాదేవీ వాళ్లు నిర్వహించకుంటే వెంటనే ఆ ఎస్‌ఎమ్‌ఎస్‌లోని నెంబరుకు ఆ మెసేజ్‌ను తిరిగి పంపించాలని పేర్కొంది. ఏదేని మోసం జరిగినట్లు గుర్తిస్తే.. 1800111109, 9449112211, 08026599990 కస్టమర్‌ కేర్‌ నెంబర్లలో ఎస్‌బీఐ ఖాతాదార్లు సంప్రదించవచ్చని ఎస్బీఐ తెలిపింది. అలాగే 155620 నెంబరును ఉపయోగించి నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చని వివరించింది.