Jan Aushadhi: అమ్మకాల్లో జనఔషధి అవుట్‌లెట్‌ల రికార్డు.. రూ.1255 కోట్ల మేర అమ్మకాలు
ప్రస్తుత రోజుల్లో వైద్యం అనేది చాలా ఖరీదైనదిగా మారింది. ముఖ్యంగా వైద్యం తర్వాత మందుల ఖర్చు కుటుంబాలను అప్పుల్లోకి నెట్టేస్తుంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరలకే ప్రజలకు మందులను అందుబాటులో ఉంచేలా కేంద్ర ప్రభుత్వం జన ఔషధి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తక్కువ ధరలకే మందులు అందుబాటులో ఉండే జనఔషధి కేంద్రాలు ప్రజలను బాగా ఆకర్షించాయి. అమ్మకాల్లో ప్రత్యేక రికార్డులను సృష్టిస్తుంది. జన ఔషధి అవుట్‌లెట్‌ల ద్వారా ఔషధాల విక్రయం రూ. 1,255 కోట్ల మార్కును అధిగమించిందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఫార్మాస్యూటికల్స్ శాఖ ఆధ్వర్యంలోని ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఎంబీఐ) విక్రయాలు నవంబర్ చివరి వరకు రూ. 1,255 కోట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్థాయి విక్రయాల వల్ల పౌరులకు దాదాపు రూ. 5,020 కోట్ల ఆదా అయ్యిందని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పీఎంబీజేపీ) పథకంలో భాగంగా జన ఔషధి కేంద్రాల ఔషధాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. పౌరులకు ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాన్ని పెంపొందించడం కోసం సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ & అస్సాం రైఫిల్స్ (సీఏపీఎఫ్‌లు, ఎన్ఎస్‌జీ& ఏఆర్)తో అనేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. మొదటి ఓవర్సీస్ జన్ ఔషధి కేంద్రం మారిషస్‌లో ప్రారంభించబడింది.
ఫార్మాస్యూటికల్స్ శాఖ మొత్తం రూ. 500 కోట్లతో ఔషధ పరిశ్రమను బలోపేతం చేసేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక పథకాన్ని అమలు చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మా క్లస్టర్‌లు, ఎంఎస్ఎంఈల ఉత్పాదకత, నాణ్యత, ఎంఎస్ఎంఈ క్లస్టర్‌లను మెరుగుపరచడానికి ఈ పథకాన్ని రూపొందించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి