Fixed Deposit: ఆర్‌బీఐ రెపో రేట్ ఎఫెక్ట్.. వడ్డీ రేట్లను సవరించిన ప్రముఖ బ్యాంకు
భారతదేశంలో పెట్టుబడిదారులకు నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉంటాయి. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు అనేవి ఆర్‌బీఐ రెపో రేటుకు అనుగుణంగా బ్యాంకులు అందిస్తూ ఉంటాయి. ఇటీవల ఎంపీసీ సమావేశంలో ఆర్‌బీఐ రెపో రేటును సవరించడంతో బ్యాంకులన్నీ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి.

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన డీసీబీ బ్యాంక్ కొన్ని కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 65 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. సవరించిన రేట్లు ఫిబ్రవరి 14, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ఫిబ్రవరి ఎంపీసీ సమావేశం 2025లో ఆర్‌బీఐ తన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.50 శాతం నుండి 6.25 శాతానికి తగ్గించాలని నిర్ణయించాక ఎఫ్‌డీ రేట్లలో సవరణ వచ్చింది. ఐదేళ్ల తర్వాత బెంచ్‌మార్క్ లెండింగ్ రేటులో మొదటిసారి కోత విధించారు. రెపో రేటు తగ్గుదల బ్యాంకుల నిధుల ఖర్చును తగ్గిస్తుంది. కాబట్టి రుణాలు, డిపాజిట్ రేట్లు ప్రభావితమవుతాయి. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో డీసీబీ బ్యాంకు తాజా వడ్డీ రేట్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
డీసీబీ బ్యాంక్ ప్రస్తుతం 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు టెన్యూర్‌కు అనుగుణంగా రూ. 3 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 3.75 శాతం నుంచి 8.05 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. 19 నుండి 20 నెలల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలకు అత్యధిక వడ్డీ రేటు 8.05 శాతం అందిస్తుంది. రూ.3 కోట్ల లోపు డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం నుంచి 8.55 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. 19 నుంచి 20 నెలల టెన్యూర్ డిపాజిట్లకు అయితే 8.55 శాతం వడ్డీను అందిస్తుంది.
అలాగే సాధారణ పౌరులకు 26 నెలల కంటే ఎక్కువ కానీ 37 నెలల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీ వడ్డీ రేటును 55 బేసిస్ పాయింట్లు తగ్గించారు. అంటే 8.05 శాతం నుంచి 7.50 శాతానికి తగ్గించారు. 37 నుంచి 38 నెలల మధ్య కాలపరిమితితో వచ్చే ఎఫ్‌డీల వడ్డీ రేటును 8.05 శాతం నుంచి 7.85 శాతానికి తగ్గించారు. అదనంగా డీసీబీ బ్యాంక్ 38 నెలల కంటే ఎక్కువ కానీ 61 నెలల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీ వడ్డీ రేటును 65 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే 8.05 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి