PSB Banks: పీఎస్‌బీ బ్యాంకుల ప్రైవేటీకరణకు కసరత్తు.. వర్షాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు..
పలు సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని సంస్థలను ప్రైవేటీకరించిన కేంద్ర సర్కార్ తాజాగా మరి కొన్నింటిని ప్రైవేట్‌పరం చేయనుంది...
పలు సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని సంస్థలను ప్రైవేటీకరించిన కేంద్ర సర్కార్ తాజాగా మరి కొన్నింటిని ప్రైవేట్‌పరం చేయనుంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరించనుంది. ఇందుకు సంబంధించి వచ్చే నెలలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లును తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వేగవంతమయ్యే అవకాశం ఉంది. 2021-22 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSB), ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరించడానికి ప్రతిపాదించారు.
నివేదికల ప్రకారం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరించే అవకాశం ఉంది. అయితే ఈ రెండు బ్యాంకుల పేర్లను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఈ రెండు బ్యాంకుల్లో ప్రస్తుతం ఉన్న 51 శాతం వాటాను 26 శాతానికి తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉంది. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు ఆమోదం పొందినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అందుకే పార్లమెంట్ సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.