EPFO: పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త.. ఇప్పుడు ఎక్కడి నుంచైనా పెన్షన్!
EPFO Pension Scheme: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) పెన్షనర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది ఈపీఎఫ్‌వో. ఇప్పటి వరకు పెన్షన్ పొందాలంటే వారు ఉండే ప్రాంతంలోని బ్రాంచ్‌లను సందర్శించి పెన్షన్ తీసుకునే సదుపాయం ఉండేది. కానీ ఇప్పుడు కేంద్రం కొత్త వ్యవస్థను తీసుకువచ్చింది. ఇప్పుడు ఏ బ్రాంచ్ నుంచైనా పెన్షన్ తీసుకునేలా సదుపాయాన్ని తీసుకువచ్చింది..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) పెన్షనర్లకు శుభవార్త. ఇప్పుడు వారు ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకోవచ్చు. EPFO దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ (CPPS) అమలును పూర్తి చేసింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. డిసెంబరు, 2024 నాటికి EPFO మొత్తం 122 పెన్షన్ పంపిణీ ప్రాంతీయ కార్యాలయాలకు చెందిన 68 లక్షల మందికి పైగా పెన్షనర్లకు సుమారు రూ. 1,570 కోట్ల పెన్షన్ పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
దేశంలోని ఏ బ్యాంక్ నుంచైనా విత్‌డ్రా..
ఈ మార్పు తర్వాత దేశంలోని ఏ బ్యాంకు నుంచి అయినా ఏ శాఖ నుంచి అయినా పెన్షనర్లు తమ పెన్షన్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చని కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా తెలిపారు. ఇప్పుడు ఈపీఎఫ్‌వో పెన్షనర్లు దేశంలోని ఏదైనా ప్రాంతీయ EPFO కార్యాలయం నుండి తమ పెన్షన్‌ను ఉపసంహరించుకోవచ్చు. దేశంలోని మొత్తం 122 ప్రాంతీయ ఈపీఎఫ్‌వో కార్యాలయాల్లో ఈ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ అమలు చేసింది.
CPPS వ్యవస్థ జనవరి 2025 నుండి పెన్షనర్ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారినప్పుడు లేదా అతని బ్యాంక్ లేదా బ్రాంచ్‌ను మార్చినప్పుడు కూడా పెన్షన్ చెల్లింపు ఆర్డర్‌లను (PPO) ఒక కార్యాలయం నుండి మరొక కార్యాలయానికి బదిలీ చేయవలసిన అవసరం లేకుండా భారతదేశం అంతటా పెన్షన్ పొందవచ్చు. పదవీ విరమణ తర్వాత స్వగ్రామానికి వెళ్లే పెన్షన్‌దారులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది.
కేంద్ర పెన్షన్ చెల్లింపువ్యవస్థ మొదటి పైలట్ ప్రాజెక్టు గత ఏడాది అక్టోబర్‌లో కర్నాల్, జమ్మూ- శ్రీనగర్ ప్రాంతీయ కార్యాలయాలలో 49,000 మందికి పైగా ఈపీఎస్ పెన్షనర్లకు సుమారు 11 కోట్ల రూపాయల పెన్షన్ పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండో ప్రయోగాన్ని నవంబర్‌లో 24 ప్రాంతీయ కార్యాలయాల్లో చేపట్టగా, 9.3 లక్షల మందికి పైగా పింఛనుదారులకు రూ.213 కోట్ల పెన్షన్‌ను పంపిణీ చేసినట్లు పేర్కొంది.
పెన్షన్ సేవలను మెరుగుపరిచే దిశగా ఒక మైలురాయి అని, ఈపీఎఫ్‌వో డిసెంబర్‌లో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 కింద కొత్త CPPS పూర్తి స్థాయి రోల్ అవుట్‌ను పూర్తి చేసిందని తెలిపింది. ప్రస్తుతం పెన్షన్ పంపిణీ వ్యవస్థలో డీసెంట్రలైజ్డ్‌వ్యవస్థ ఉంది. దీని వల్ల ప్రస్తుతం ఈపీఎఫ్‌వో జోనల్, ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు చేసుకుంది. దీంతో పెన్షన్ ప్రారంభ సమయంలో పెన్షన్‌దారులు ధృవీకరణ కోసం సంబంధిత బ్రాంచ్‌లకు వెళ్లాల్సి ఉండేది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పెన్షన్ విధానం వల్ల బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు పెన్షన్ విడుదలైన వెంటనే ఖాతాలో జమ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి