Google pay: ఆ బిల్లులు కడితే చార్జీల బాదుడే.. గూగుల్ పేలో కొత్త నిబంధనలు
ప్రజల జీవితాల్లో ఆధునిక టెక్నాలజీ అనేక మార్పులను తీసుకువచ్చింది. అన్ని పనులను సులువుగా చేసుకునే అవకాశం కలిగించింది. వాటిలో డిజిటల్ చెల్లింపులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ విధానంలో అన్ని ఆర్థిక లావాదేవీలను చాలా వేగంగా, సులభంగా జరుపుకోవచ్చు. విద్యుత్, గ్యాస్, ఫోన్ రీచార్జి.. ఇలా అనేక బిల్లులను సులభంగా చెల్లించవచ్చు.

బిల్లుల చెల్లింపులకు అనుమతిచ్చే వివిధ యాప్ లలో గూగుల్ పే ఒకటి. మన దేశంలో దీని ద్వారా అనేక మంది ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే తన యూజర్లకు గూగుల్ పే షాక్ ఇచ్చింది. కార్డుల ద్వారా చెల్లించే బిల్లులపై చార్జీ వసూలు చేస్తోంది. ప్రస్తుతం కిరాణా షాపు నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ, రోడ్డు పక్కనే ఉన్న చిన్న పండ్ల బండి నుంచి విమానం టిక్కెట్ల వరకూ అన్నింటికి డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ లోని వివిధ చెల్లింపుల యాప్ ల ద్వారా యూపీఐ విధానంలో వీటిని జరుపుకోవచ్చు. గతంలో ఉచితంగా ఉండే ఈ సేవలు క్రమంగా చార్జీల రూపంలోకి మారుతున్నాయి. దీనిలో భాగంగానే గూగుల్ పే ద్వారా చెల్లిస్తున్న విద్యుత్, గ్యాస్, ఫోన్ రీచార్జులకు చార్జీ పడనుంది. అయితే ఇద్దరు వ్యక్తులు, దుకాణదారుడికి చేసే చెల్లింపులు మాత్రం ఉచితంగానే జరుగుతాయి.
గూగుల్ పే తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఆ యాప్ లో డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసిన బిల్లుల చెల్లింపులపై ఒక శాతం చార్జీని వసూలు చేస్తారు. ఉదాహరణకు మీరు నెలకు రూ.1500 విద్యుత్ బిల్లు కడుతూ ఉంటే, దానిపై ఒక శాతం అదనంగా వసూలు చేస్తారు. అయితే చెల్లింపుల చార్జీలను గూగుల్ పే మాత్రమే వసూలు చేయడం లేదు. ప్రముఖ చెల్లింపుల యాప్ అయిన పేటీఎం, ఫోన్ పే తదితర వాటిలోనూ అమలవుతున్నాయి. వినియోగదారుల సౌకర్యం కోసం గూగుల్ పే కొత్త ఫీచర్లను తీసుకురానుంది. రాబోయే రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. దాని ద్వారా మీ యూపీఐ ప్రాథమిక ఖాతాకు మీ తల్లిదండ్రులు, పెద్దలు, కుటుంబ సభ్యులను లింక్ చేయవచ్చు. తద్వారా వారు యూపీఐ ఖాతాను తయారు చేసుకోకుండానే చెల్లింపులు జరుపుకోవచ్చు.
మన దేశంలో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ ఈ విధానాన్ని పాటిస్తున్నారు. సులభంగా చెల్లింపులు జరగడం, చిల్లర సమస్యలు లేకపోవడంతో అందరూ అలవాటు పడుతున్నారు. దేశంలో ప్రజలందరికీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం అత్యంత ముఖ్యమైన కారణం. గతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జేబులో డబ్బులను పెట్టుకునేవారు. ఇప్పుడు కేవలం స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. దానిలోని యాప్ ల ద్వారా యూపీఐ విధానంలో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు జరుపుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








