AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Train: ఇక దూసుకెళ్లాల్సిందే.. గంటకు 320 కిలోమీటర్లు.. భారత్‌లో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు ఇదే..

భారత్‌లో బుల్లెట్ రైలు రయ్ రయ్ మంటూ పరుగులు పెట్టబోతుందా అంటే.. వచ్చే ఏడాది ఇది నిజం కాబోతుంది అంటుంది కేంద్రం. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌ పనులు ఎక్కడి వరకు వచ్చాయి?. మన దగ్గర ఎటువంటి బుల్లెట్ ట్రైన్స్ వినియోగించబోతున్నారో.. చూద్దాం.

Bullet Train: ఇక దూసుకెళ్లాల్సిందే.. గంటకు 320 కిలోమీటర్లు.. భారత్‌లో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు ఇదే..
Bullet Train
Shaik Madar Saheb
|

Updated on: Jul 15, 2025 | 10:01 AM

Share

వచ్చే ఏడాది భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ ట్రయల్‌ రన్ నిర్వహించేలా వాయువేగంతో పనులు చేస్తుంది రైల్వేశాఖ. బుల్లెట్ ట్రైన్ ముంబై–అహ్మదాబాద్‌ కారిడార్‌ పొడవు 508 కిలోమీటర్లు. ఇందులో 310 కిలోమీటర్ల వయాడక్ట్‌ల నిర్మాణం పూర్తయింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలకంగా మారిన 21 కిలోమీటర్ల అండర్ వాటర్ టన్నెల్ కూడా పూర్తి చేశారు అధికారులు. దీంతో ఈ ప్రాజెక్టులో మేజర్ మైల్ స్టోన్ సాధించినట్లైంది. ఇక ట్రాక్ నిర్మాణం, ఎలక్ట్రికల్ వర్క్, స్టేషన్స్, బ్రిడ్జిల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తున్నారు. 15 రివర్ బ్రిడ్జిల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందన్నారు అధికారులు. మరో 4 పూర్తి దశలో ఉన్నాయని తెలిపారు. మొత్తం 12 స్టేషన్లలో 5 కంప్లీట్ అవ్వగా.. మరో మూడు పూర్తి దశకు చేరుకున్నాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ దగ్గర నిర్మించే స్టేషన్ ఇంజినీరింగ్ మార్వెల్‌గా చెబుతున్నారు. భూమికి 32మీటర్ల లోతులో ఈ స్టేషన్ నిర్మాణం ఉండబోతుందని అధికారులు చెబుతున్నారు.

జపాన్ నుంచి బుల్లెట్ ట్రైన్స్ తీసుకురానుంది భారత్. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద జపాన్ భారత్‌కు రెండు షింకన్‌సెన్ రైళ్లయిన E5, E3 సిరీస్‌లను బహుమతిగా ఇవ్వనుంది. ఇవి 2026 ప్రారంభంలో డెలివరీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ రైళ్లలో అత్యాధునిక తనిఖీ వ్యవస్థలు అమర్చబడి ఉంటాయి. ఇవి ట్రాక్ స్థితి, ఉష్ణోగ్రత, దుమ్ము నిరోధకత లాంటి సమాచారాన్ని నమోదు చేస్తాయి. ఈ డేటాను భవిష్యత్తులో మేక్ ఇన్ ఇండియా కింద రూపొందించే నెక్ట్స్ జనరేషన్ ట్రైన్స్.. E10 సిరీస్ బుల్లెట్ రైళ్ల తయారీలో ఉపయోగిస్తారు. బుల్లెట్‌ రైలు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించనుంది. ఈ 508 కి.మీ. పొడవైన కారిడార్‌లో ముంబై నుండి అహ్మదాబాద్ వరకు ప్రయాణం కేవలం 2 గంటల 7 నిమిషాల్లో పూర్తవుతుంది.

ఈ మార్గంలో థానే విరార్, వాపి, సూరత్, వడోదర వంటి నగరాలు సహా 12 స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కోసం 2016లో భారతదేశం-జపాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఆరు బుల్లెట్‌ రైళ్ల కారిడార్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది కేంద్రం.

తప్పుడు ప్రచారం..

అయితే.. ముంబై – అహ్మదాబాద్ మధ్య జపనీస్ బుల్లెట్ రైలు నడవదంటూ అసత్య ప్రచారం కొనసాగుతోంది.. కొన్ని వార్తా నివేదికలు, సోషల్ మీడియా పోస్టులు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని.. వాటిని నమ్మోద్దని.. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) సోమవారం తెలిపింది. “ముంబై-అహ్మదాబాద్ మార్గంలో జపనీస్ బుల్లెట్ రైలును నడపకూడదని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని కొన్ని కథనాలు, సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి”.. ఇదంతా అబద్దం, నమ్మోద్దంటూ PIB తన X హ్యాండిల్‌లో పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..