Motor Insurance: మీ వాహనానికి ఇన్సూరెన్స్ ఉందా..? లేకపోతే ఇబ్బందులే.. ప్రభుత్వం కీలక నిర్ణయం
రోడ్డుపైకి వచ్చే వాహనానికి ఉండే పత్రాల్లో మోటారు బీమా ఒకటి. ప్రతి వాహనానికి బీమా చేయించుకోవడం తప్పనిసరి. చాలా మంది వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవడం..
రోడ్డుపైకి వచ్చే వాహనానికి ఉండే పత్రాల్లో మోటారు బీమా ఒకటి. ప్రతి వాహనానికి బీమా చేయించుకోవడం తప్పనిసరి. చాలా మంది వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవడం లేదు. వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు బీమా చేసినప్పటికీ, దానిని రెన్యూవల్ చేయకుండా వదిలేస్తున్నారు. భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది ఇన్సూరెన్స్ లేని వాహనాలు తిరుగుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వాహనానికి బీమా తప్పనిసరి. అయితే బీమా లేకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) ఇప్పటికే అన్ని వాహనాలకు బీమా కవరేజీని నిర్ధారించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బీమా లేని వాహనాల యజమానులకు రవాణా శాఖ త్వరలో నోటీసులు జారీ చేయనుంది. మీ వాహనానికి ఇంకా ఇన్సూరెన్స్ లేదా రెన్యూవల్ కాకపోతే ముందుగా పూర్తి చేసుకోవడం మంచిది.
బీమా లేకుండా వాహనం నడిపితే రవాణా శాఖ అధికారులు రూ.2000 జరిమానా విధిస్తారు. ప్రతి రాష్ట్రంలో ఇటువంటి వాహనాలను గుర్తించేందుకు ఒక బీమా కంపెనీని నియమించారు. బీమా లేని వాహనాల జాబితా రవాణా శాఖకు అధికారులకు పంపిస్తారు. ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రతి వాహనం గురించిన సమాచారం ఉంటుంది.
బీమా చేయకపోతే ఏమవుతుంది ?
కేంద్ర ప్రభుత్వ మోటారు వాహన చట్టం ప్రకారం.. బీమా లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.2,000 జరిమానా విధించవచ్చు. అటువంటి వాహనాన్ని గుర్తించిన తర్వాత రవాణా శాఖ ఆ వాహనం యజమానికి నోటీసు జారీ చేస్తుంది. వాహన యజమాని జరిమానా మొత్తంతో పాటు వాహనానికి బీమా కూడా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని వాహనాలకు బీమా ఉండేలా ఐఆర్‌డీఏఐ చర్యలు చేపడుతోంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. భారతదేశంలో 30 కోట్లకు పైగా వాహనాలు తిరుగుతున్నాయి. వాటిలో సగానికి పైగా బీమా లేనివి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 4-5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో సుమారు లక్షన్నర ప్రమాదాలు తీవ్రమైనవి. 18 నుంచి 45 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని అధికారులు చెబుతున్నారు. అలాగే వాహనాలకు ఇన్సూరెన్స్ చేయడం కూడా చాలా ముఖ్యమైనదిగా ప్రభుత్వం భావించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి