Gas Connection: గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్చుకోవాలా..? ఈ రెండు డాక్యుమెంట్స్ ఉంటే చాలు.. నిమిషాల్లోనే పని పూర్తి..
మీరు గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారా.. అయితే చాలా సింపుల్. చాలామందికి ప్రాసెస్ తెలియక ఆందోళన పడుతుంటారు. నగరాలు, పట్టణాల్లో అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఇల్లు మారుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం.

ప్రతీ ఇంట్లో అత్యంత అవసరమైన వస్తువు గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్ లేనిది వంట చేసుకోవడం చాలా కష్టమవుతుంది. దీంతో ప్రతీఒక్కరి ఇంట్లో ఇది తప్పనిసరిగా ఉంటుంది. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కేంద్రం ఇటీవల అనేక మార్పులు చేస్తోంది. గ్యాస్ బుకింగ్‌కు గడువు విధించడంతో పాటు కొత్త కనెక్షన్ల జారీ నిలిపివేసింది. దీంతో పాటు గ్యాస్ డెలివరీకి ఓటీపీని తప్పనిసరి చేసింది. ఇక కేవైసీ ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకోవాలని వినియోగదారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్-అమెరికా మధ్య యుద్దం క్రమంలో కొత్త కనెక్షన్ల జారీని కేంద్రం నిలిపివేయగా.. అడ్రస్ మార్పునకు అవకాశం కల్పిస్తున్నారు. మీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఇల్లు షిప్ట్ అవుతుంటే గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్చుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ మార్చుకోకపోతే పాత అడ్రస్‌కు గ్యాస్ డెలివర అవుతుంది. అడ్రస్ మార్చుకోవడానికి ప్రాసెస్ ఏంటి..? ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం? అనేది చూద్దాం,.
అడ్రస్ మార్చుకోవడానికి ఏయే డాక్యుమెంట్స్ అవసరం..?
కొత్త ఇంటి అడ్రస్ ధృవీకరణ కోసం రెంటల్ అగ్రిమెంట్, వాటర్ బిల్లు, విద్యుత్ బిల్లు లాంటివి అవసరం. ఇక మీ వ్యక్తిగత వివరాలు ధృవీకరణ కోసం ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ లాంటి ఏదైనా పత్రం అవసరం. ఇక గ్యాస్ పాస్ బుక్ కూడా అందించాలి.
ప్రాసెస్ ఏంటి..?
-ముందుగా మీ ప్రస్తుత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లండి
-బదిలీ రద్దు వోచర్ తీసుకోండి
-అనంతరం మీరు కొత్తగా మారిన ఇంటి పరిధిలోని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి బదిలీ రద్దు వోచర్ అందించండి
-ఇక ఇంటి అడ్రస్ ధృవీకరణ కోసం కరెంట్, వాటర్ బిల్లు లాంటి డాక్యుమెంట్ అందించండి
-ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదైనా అందించండి
-ఈకేవైసీ పూర్తి చేయండి
-అనంతరం మీ అడ్రస్ అప్డేట్ అవుతుంది. మీరు గ్యాస్ బుక్ చేసుకుంటే కొత్త చిరునామాకు అవుతుంది
వేరే సిటీ,పట్టణానికి వెళితే..
అయితే మీరు వేరే సిటీ, పట్టణానికి మారితే మీ సిలిండర్, ప్రెషర్ రెగ్యులేటర్ ప్రస్తుతం ఉన్న ఏజెన్సీకి తిరిగి ఇచ్చి సెక్యూరిటీ డిపాజిట్ వాసస్ పొందాలి. రద్దు వోచర్ తీసుకోవాలి. మీరు మారిన ప్రాంతంలోని గ్యాస్ ఏజెన్సీని ఆశ్రయించి కొత్త కనెక్షన్ పొందాలి. కొత్త కనెక్షన్ కోసం అప్లికేషన్ పూర్తి చేసి కరెంట్ బిల్లు, ఆధార్ కార్డు లాంటివి సమర్పించాలి. సెక్యూరిటీ డిపాజిట్, ఇతర ఫీజులు చెల్లిస్తే కొత్త కనెక్షన్ మంజూరు అవుతుంది. అనంతరం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
