Komaki venice: కొమాకి వెనిస్..వెరీ నైస్.. మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల
దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా రోజురోజుకూ పెరుగుతోంది. అనేక కంపెనీలు ఈ విభాగంలో వాహనాలను విడుదల చేస్తున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఫీచర్లు, లుక్ తో తళుక్కున మెరుస్తున్నాయి. పెట్రోలు వాహనాలకన్నా వీటిని కొనుగోలు చేయడానికే ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అడుగు పెట్టింది. కొమాకి వెనిస్ పేరుతో మూడు రకాల వేరియంట్లలో విడుదలైంది. ఈ స్కూటర్ ప్రత్యేకతలు, ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
కొమాకి కంపెనీ 2016 నుంచి దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తోంది. దీనికి ఢిల్లీ ఎన్ సీఆర్ లో కార్యాలయాలు, గిడ్డంగులు ఉన్నాయి. అయితే మౌలిక సదుపాయాల యూనిట్లలో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ నుంచే వెనిస్ అనే స్కూటర్ లేటెస్టుగా విడుదలైంది. వెనిస్ స్కూటర్ లుక్, డిజైన్ పరంగా అత్యద్భుతంగా ఉంది. సీట్ల మధ్య పార్టిషన్ ఉన్నందున ఇద్దరు వ్యక్తులు విశాలంగా కూర్చునే అవకాశం ఉంది. రైడర్ వెనుక కూర్చునే వ్యక్తి కోసం డ్యూయల్ సైడ్ ఫుట్ రెస్ట్ ఏర్పాటు చేశారు. రాత్రి పూట డ్రైవింగ్ చేయడానికి వీలుగా సూపర్ బ్రైట్ ఎల్ఈడీ లైట్లు అమర్చారు. అలాగే బలమైన, పటిష్టమైన స్టీల్ ప్రేమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కొమాకి వెనిస్ స్కూటర్ లుక్ పరంగా ఆకట్టుకుంటోంది. దీన్ని తొమ్మిది రకాల రంగుల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫ్యూర్ గోల్డ్, స్టీల్ గ్రే, బ్రైట్ ఆరెంజ్, గార్నెట్ రెడ్, ప్యూర్ వైట్, ఐకానిక్ ఎల్లో, జెట్ బ్లాక్, మెటాలిక్ బ్ల్యూ, సెక్రమెంటో గ్రీన్ కలర్లలో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వెనిస్ స్పోర్ట్ (క్లాసిక్), వెనిస్ స్పోర్ట్ (ఫెర్మామెన్స్ అప్ గ్రేడ్), వెనిస్ అల్ట్రా స్పోర్ట్ (ఫెర్మామెన్స్ అప్ గ్రేడ్) అనే మూడు రకాల వేరియంట్లలో స్కూటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వెనిస్ స్పోర్ట్ (క్లాసిక్) ధరను రూ.1.03,900గా నిర్ణయించారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 75 నుంచి వంద కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.
వెనిస్ స్పోర్ట్ (ఫెర్మామెన్స్ అప్ గ్రేడ్) స్కూటర్ ధర రూ.14,49,757. సింగిల్ చార్జింగ్ తో సుమారు 200 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. వెనిస్ అల్ట్రా స్పోర్ట్ (ఫెర్మామెన్స్ అప్ గ్రేడ్) వేరియంట్ రూ.1,67,500 పలుకుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 300 కిలోమీటర్లు రేంజ్ వస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. రిమూవబుల్ బ్యాటరీ, పోర్టబుల్ చార్జర్ తో పాటు లైఫే పో04 యాప్ ఆధారిత స్మార్ట్ బ్యాటరీ, మోటారు వేగాన్ని నియంత్రించే 50 ఏఎంపీ మోటారు కంట్రోల్ ఉన్నాయి. ఈ స్కూటర్ బ్యాటరీను పూర్తిగా చార్జింగ్ చేయడానికి సుమారు నాలుగున్నర గంటల సమయం పడుతుంది. ఎఫ్ఎం రేడియో, బ్ల్యూటూత్ ద్వారా ఫోన్ కనెక్ట్ చేయగల డిజిటల్ డ్యాష్ బోర్డు, కీలెస్ ఎంట్రీ తదితర ఫీచర్లు ఉన్నాయి. అలాగే నాన్ ఎలక్ట్రిక్ వాహనాల్లో గేర్లుగా పనిచేసే మూడు స్పీడ్ మోడ్ లు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి