Indigo: ఇండిగో ప్రయాణికులకు జాక్‌పాట్.. ఉచితంగా రూ.10 వేలు..
ఇటీవల ఇండిగో విమానాలు భారీగా రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో ఆందోళనకు దిగారు. దాదాపు వారం రోజుల పాటు సర్వీసులకు అంతరాయం ఏర్పడగా.. ఇప్పటికప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఈ క్రమంలో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన ఇండిగో.. మరో నిర్ణయం తీసుకుంది.

ఇండిగో సంక్షోభంలో చిక్కుకోవడంతో దేశవ్యాప్తంగా వేల మంది ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిర్వహణ కారణంగా ఇండిగో దేశవ్యాప్తంగా 2 వేలకుపైగా విమానాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. ప్రయాణికులు ఆందోళనకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు పూర్తి రీఫండ్ వెంటనే అందించాలని, సర్వీసులను వెంటనే పునరుద్దరించాలని ఇండిగోకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇండిగో సర్వీసుల రద్దుపై విచారణకు కూడా కేంద్రం ఆదేశించింది. దీంతో 10 రోజుల్లో తాము సర్వీసులు యాథావిధిగా నడిచేలా చర్యలు తీసుకుంటామని ఇండిగో కేంద్రంకు హామీ ఇచ్చింది.
సర్వీసులు రద్దు కావడంతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు గురువారం ఇండిగో ఊరట కలిగించింది. ఈ నెల 3, 4, 5 తేదీల్లో టికెట్లు రద్దైన ప్రయాణికులకు రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ వోచర్లు ఏడాదిలోగా ఎప్పుడైనా ఉపయోగించుకునే వీలుంటుందని సంస్థ వెల్లడించింది. ఈ మేరకు దీనిపై అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింద. ఈ ప్రకటనలో ఏముందంటే..”ప్రయాణికుల గురించి జాగ్రత్తలు తీసుకోవడంలో మేము ఎప్పుడూ ముందుంటాం. రద్దైన విమాన సర్వీసులకు సంబంధించిన ప్రయాణికులకు ఇప్పటికే పూర్తి రీఫండ్ అందించాం. ఇప్పటికే ప్రయాణికుల అకౌంట్లో అవి జమయ్యాయి. ట్రావెల్ పార్టనల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని ఉన్నవారికి కూడా రీఫండ్ వస్తుంది. కానీ ఆ ప్రయాణికుల పూర్తి వివరాలు మా డేట్‌బేస్‌లో లేవు. మీకు రీఫండ్ అందకపోతే customer.experience@goindigo.inకు మెయిల్ చేస్తే మేము సహాయం చేస్తాం” అని పేర్కొంది.
“డిసెంబర్ 3,4,5వ తేదీల్లో విమాన సర్వీసుల రద్దు వల్ల ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుని గంటలపాటు ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు రూ.10 వేల ట్రావెల్ వోచర్ అందిస్తున్నాం. వచ్చే 12 నెలల్లో ఎప్పుడైనా దీనిని ఉపయోగించుకోవచ్చు. ప్రయాణానికి 24 గంటల ముందు సర్వీసులు రద్దు అయి ఇబ్బంది పడ్డవారికి ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పరిహారం చెల్లిస్తున్నాం. దానితో సంబంధం లేకుండా ఈ రూ.10 వేల వోచర్ అందిస్తున్నాం” అని ఇండిగో తెలిపింది.




