Imports: ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్న ఆ మూడు దిగుమతులు.. రానున్న నెలల్లో కష్టమేనంటున్న నిపుణులు..
Inflation: ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం అంచనాలను 6.7 శాతానికి సవరించింది.
Inflation: ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం అంచనాలను 6.7 శాతానికి సవరించింది. బడ్జెట్ అనంతర ఫిబ్రవరి పాలసీలో ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతంగా అంచనా వేసిన తర్వాత ప్రస్తుత సంవత్సరానికి దాని ప్రొజెక్షన్‌లో ఇది రెండవ సవరణగా చెప్పుకోవాలి. పెరిగిన నిత్యావసరాల ధరలు, విద్యుత్ ఛార్జీల్లో సవరణలు, నిరంతర వాణిజ్యం, సరఫరా గొలుసు అడ్డంకులు, ఉత్పాదక వస్తువులు, సేవల రిటైల్ ధరలకు ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వంటివి ద్రవ్యోల్బణం పెరిగేందుకు ఆజ్యం పోస్తున్నాయి. సంవత్సరానికి భారతీయ బాస్కెట్ పెట్రోలియం క్రూడ్ బ్యారెల్‌కు సగటున 105 డాలర్లుగా ఉంటుందని, రుతుపవనాలు సాధారణంగా ఉంటాయని కమిటీ అంచనా వేసింది. ఈ మూడు దిగుమతుల వల్ల ద్రవ్యోల్బణం రానున్న కాలంలో మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెరుగుతున్న పెట్రో ధరలు..
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్‌లోని విశ్లేషకుల అంచనాల ప్రకారం చమురు ధరల కదలికపై RBI అంచనాలు సాంప్రదాయకంగా కనిపిస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ OPEC కొన్ని సభ్యులు కూడా డిమాండ్ పెరుగుతున్నందున ముడి చమురు ధరలు రాబోయే నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. క్రూడ్ ధరలు పెరగటంతో జూన్ మొదటి పది రోజులకు ఇది బ్యారెల్‌కి దాదాపు 118 డాలర్లుగా ఉంది. ఈ తరుణంలో చమురు ధరలు ఇలాగే పెరుగుతూ పోతే దాని ప్రభావం సామాన్యులపైనే కాక, పరిశ్రమల మీద, ఇతర ఆహార ఉత్పత్తుల మీద ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.
దిగుమతి చేసుకున్న బొగ్గు నుంచి విద్యుత్..
కోల్ ఇండియా, ఇతర దేశీయ వనరుల నుంచి బొగ్గు సరఫరాలో కొరత కారణంగా దేశంలో విద్యుత్ సంక్షోభం పెరిగింది. దీని వల్ల ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉన్నందున, దిగుమతి చేసుకున్న, దేశీయంగా సేకరించిన బొగ్గును కలపాలిపి వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కంపెనీలను ఆదేశించింది. బ్లెండింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి జూన్ 15 వరకు గడువు ఇచ్చింది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో.. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పుడు బొగ్గు ధరలు టన్నుకు 140 నుంచి 440 డాలర్లకు పెరిగాయి. ధరలు గరిష్ఠ స్థాయి నుంచి టన్నుకు దాదాపు 330-395 డాలర్ల వరకు తగ్గాయి. దిగుమతి చేసుకున్న బొగ్గు దేశీయంగా లభించే బొగ్గు కంటే చాలా ఖరీదైనది. దీని కారణంగా యూనిట్ విద్యుత్ కు కొత్తగా 70 పైసల నుంచి రూపాయి వరకు టారిఫ్ పెరుగుతుందని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ తెలిపింది. దీని వల్ల రిటైల్, హోల్ సేల్ ద్రవ్యోల్బణం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎడిబుల్ ఆయిల్ సరఫరా కొరత..
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతిదారుగా ఉంది. దేశంలోని మెుత్తం డిమాండ్‌లో 55-60 శాతం దిగుమతుల ద్వారానే తీర్చబడుతున్నాయి. పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ భారత్ దిగుమతి చేసుకుంటున్న కీలకమైన ఆహార నూనెలు. యుక్రెయిన్, రష్యా ప్రధాన ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులుగా ఉన్నాయి. యుద్ధం ప్రారంభంతో పొద్దుతిరుగుడు నూనె లభ్యత ఇప్పుడు పడిపోయింది. ఇటీవల ముగిసిన పంటలో బ్రెజిల్‌లో సోయాబీన్ ఉత్పత్తి గత సంవత్సరం కంటే 10 శాతం తక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో వంట నూనె ధరలు మరింత కాక పుట్టించనున్నాయి. ఈ తరుణంలో ఈ మూడు దిగుమతుల కారణంగా భారత్ లో ద్రవ్యోల్బణం రానున్న మరిన్ని నెలల్లో పెరుగుతుందని నిపుణుల అంచనాలు చెబుతున్నాయి.