Gold: బంగారానికి భారీగా పెరిగిన డిమాండ్.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జోరుగా పసిడి కొనుగోళ్లు.. ఎంతంటే..!
India’s Gold Demand Increased: బంగారం అంటే మహిళలకు ఎనలేని ప్రేమ. పసిడికి భారతీయులు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా.. కొనుగోలు చేసేందుకు..
India’s Gold Demand Increased: బంగారం అంటే మహిళలకు ఎనలేని ప్రేమ. పసిడికి భారతీయులు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా.. కొనుగోలు చేసేందుకు ఏ మాత్రం సంకోచించరు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో తమకు ఇష్టమైన అభరణాలకే అధికంగా మొగ్గు చూపుతుంటారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో డిమాండ్ భారీగా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో 19 శాతం గిరాకీ ఎక్కువైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 76 టన్నుల బంగారాన్ని భారతీయులు కొనుగోలు చేశారని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది.
గత ఏడాదికిపైగా ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ప్రభావం దేశీయ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. దీంతో బంగారం కొనుగోళ్లపై భారీగా ప్రతికూల ప్రభావం పడింది. గత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ఓవరాల్‌గా బంగారానికి డిమాండ్ పెరిగి 63.8 శాతం టన్నులకు చేరుకుందని ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది. విలువ పరంగా బంగారం కొనుగోళ్లలో 23 శాతం పురోగతి నమోదైంది. 2020-21 తొలి త్రైమాసికంలో రూ.26,600 కోట్ల విలువైన పసిడి కొనుగోళ్లు జరిగితే ఈ ఏడాది రూ.32,810 కోట్లకు పెరిగింది.
సెకండ్ వేవ్‌తో తగ్గిన డిమాండ్
అయితే గత సంవత్సరం నుంచి దేశాన్ని అతలకుతలం చేసిన కరోనా.. సెకండ్ వేవ్‌లో బంగారం డిమాండ్ 46 శాతం పడిపోయింది. మొదటి అర్థభాగంలో డిమాండ్ 157.6 టన్నులకు చేరుకుంది. 2019 తొలి అర్థ భాగంతో పోలిస్తే 46 శాతం తక్కువ అనే చెప్పాలి. 2015-19 మధ్య ఐదేళ్ల కాలంలో తొలి అర్థభాగంలో బంగారానికి డిమాండ్ 39 శాతం పడిపోయిందని డబ్ల్యూజీసీ పేర్కొంది.
ద్వితీయ త్రైమాసికంలో డిమాండ్ జోరు
కాగా, 2020-21 ద్వితీయత్రైమాసికంలో కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ భారీగా పడింది. 2020-21లో విధించిన లాక్‌డౌన్‌తో పోల్చినట్లయితే అనుకోని విధంగా పసిడికి డిమాండ్ భారీగా పెరిగింది. 2021 సెకండ్ క్వార్టర్‌తో పోలిస్తే 2020 రెండో త్రైమాసికంలో 19.2 శాతం బంగారానికి గిరాకీ ఎక్కువైందని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సీఈవో సోమసుందరం తెలిపారు. కానీ అక్షయ తృతీయ, వివాహాల సీజన్‌లోనూ డిమాండ్ పడిపోయిందన్నారు.