Bullet Train: ఇది రైలా.. పట్టాలపై వెళ్లే విమానమా.. బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
భారత రైల్వే చరిత్రలో కనీవినీ ఎరుగని ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. దేశం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బుల్లెట్ రైలు ఇక కల కాదు.. కళ్లముందు కదలాడుతున్న వాస్తవం.. తాజాగా కేంద్ర రైల్వే శాఖ విడుదల చేసిన ఈ హైస్పీడ్ రైలు ఫస్ట్ లుక్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. గాలిని చీల్చుకుంటూ.. సముద్ర గర్భంలో పరుగులు తీసే ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం..

భారత రైల్వే చరిత్రలో నవశకం ప్రారంభం కానుంది. దేశం మొత్తం ఎదురుచూస్తున్న ముంబై – అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. తాజాగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ హైస్పీడ్ రైలు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఢిల్లీలోని రైల్వే భవన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ భారీ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుపు, ఆరెంజ్ రంగుల మేళవింపుతో, ఏరోడైనమిక్ డిజైన్‌తో మెరిసిపోతున్న ఈ రైలును చూసి నెటిజన్లు వండర్ ఫుల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడమే కాకుండా, విమాన ప్రయాణానికి దీటైన సౌకర్యాలతో ఈ రైలును తీర్చిదిద్దుతున్నారు.
అద్భుతమైన ఫీచర్లు.. అంతకు మించిన వేగం
ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య గల 508 కిలోమీటర్ల దూరాన్ని ఈ బుల్లెట్ రైలు కేవలం 2 గంటల 7 నిమిషాల్లోనే చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ ప్రయాణానికి సుమారు 6 నుండి 8 గంటల సమయం పడుతుండగా, బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే సామాన్యుల కాలం ఎంతో ఆదా అవుతుంది. మొత్తం 12 స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణించనుంది. ఇందులో బాంద్రా కుర్లా కాంప్లెక్స్, థానే, విరార్, బోయిసర్, వాపి, సూరత్, వడోదర, అహ్మదాబాద్ వంటి ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి.
సముద్రం అడుగున ప్రయాణం.. మరో విశేషం
ఈ ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఏమిటంటే.. దేశంలోనే మొట్టమొదటిసారిగా సముద్రం అడుగున రైలు ప్రయాణించనుంది. థానే క్రీక్ వద్ద సుమారు 7 కిలోమీటర్ల మేర సముద్రగర్భంలో నిర్మిస్తున్న సొరంగ మార్గం ఈ ప్రాజెక్టుకే తలమానికం. దీని కోసం ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ బోరింగ్ మెషీన్‌ను ఇప్పటికే రంగంలోకి దించారు. మహారాష్ట్రలోని విఖ్రోలి వద్ద ఈ భారీ యంత్రం ద్వారా తవ్వకాలు వేగంగా జరుగుతున్నాయి.
మేక్ ఇన్ ఇండియా.. స్వదేశీ నైపుణ్యం
జపాన్ సాంకేతిక సహకారంతో మొదలైన ఈ ప్రాజెక్టులో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, బెంగళూరులోని బి.ఇ.ఎం.ఎల్ సంస్థలు సంయుక్తంగా ఈ బుల్లెట్ రైలు కోచ్‌లను తయారు చేస్తున్నాయి. భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ అత్యాధునిక సెన్సార్లు, ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థలను ఇందులో పొందుపరిచారు. దేశ మౌలిక సదుపాయాల రంగంలో ఈ బుల్లెట్ రైలు ఒక మైలురాయిగా నిలవనుంది. 2027 నాటికి తొలి విడత కార్యకలాపాలు ప్రారంభించే దిశగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రైలు పట్టాలెక్కితే దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమించడమే కాకుండా, సామాన్యుడి ప్రయాణ కల సాకారం కానుంది.
