AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ప్రపంచంలోనే అతిపెద్ద LNG ప్లాంట్‌లో భారీ పేలుడు.. 18 మంది గల్లంతు!

ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఉన్న బర్జాన్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో కనీసం 54 మంది గాయపడగా, మరో 18 మంది గల్లంతైనట్లు ఖతార్ అధికారులు వెల్లడించారు. దేశంలోని కీలక ఇంధన మౌలిక సదుపాయాల్లో ఒకటైన ఈ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

Watch Video: ప్రపంచంలోనే అతిపెద్ద LNG ప్లాంట్‌లో భారీ పేలుడు.. 18 మంది గల్లంతు!
Qatar Factory Explosion
Balaraju Goud
|

Updated on: Jun 22, 2026 | 3:27 PM

Share

ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఉన్న బర్జాన్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో కనీసం 54 మంది గాయపడగా, మరో 18 మంది గల్లంతైనట్లు ఖతార్ అధికారులు వెల్లడించారు. దేశంలోని కీలక ఇంధన మౌలిక సదుపాయాల్లో ఒకటైన ఈ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

ఖతార్ ఎనర్జీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆదివారం (జూన్ 21) సాయంత్రం బర్జాన్ స్థానిక గ్యాస్ సరఫరా కేంద్రంలో కార్యకలాపాలు ప్రారంభించే సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అనంతరం భారీ మంటలు చెలరేగడంతో అత్యవసర సహాయక బృందాలు, పౌర రక్షణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గంటల తరబడి శ్రమించిన తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో 54 మంది గాయపడగా, 18 మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వారిని గుర్తించేందుకు ఖతారీ అంతర్జాతీయ శోధన, సహాయక బృందాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. బాధితుల జాతీయతలు, గుర్తింపులకు సంబంధించిన వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. పేలుడుకు కారణం ప్రాథమికంగా సాంకేతిక లోపమేనని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎటువంటి ప్రమాదకర గ్యాస్ లీకేజీ లేదని, ప్రజల భద్రతకు ముప్పు లేదని స్పష్టం చేసింది. అయితే ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

పేలుడు జరిగిన సమయంలో దోహా నగర పరిసర ప్రాంతాల్లో కూడా భారీ శబ్దం వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సోషల్ మీడియాలో భారీ అగ్నిగోళం, దట్టమైన పొగలు ఎగసిపడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద LNG ఉత్పత్తి, ఎగుమతి కేంద్రాల్లో ఒకటైన రాస్ లఫాన్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ ఘటనతో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన భద్రతా నిబంధనలు, ఆధునిక మానిటరింగ్ వ్యవస్థలు, అత్యవసర సన్నద్ధత చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రమాద వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us