AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్ గురించి తెలిస్తే అవాక్కే..

ముంబైలో ఉదయం ఇడ్లీ, సాంబార్ తిని.. మధ్యాహ్నానికి దుబాయ్‌లో లంచ్ చేయాలనుకుంటున్నారా? విమానం కంటే వేగంగా, సముద్రం అడుగున ప్రయాణిస్తూ షార్క్‌లు, తిమింగలాలను చూస్తూ దుబాయ్ వెళ్లిపోవాలని ఉందా? వినడానికి ఏదో హాలీవుడ్ గ్రాఫిక్స్ సినిమా కథలా ఉంది అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే..

జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్ గురించి తెలిస్తే అవాక్కే..
Mumbai To Dubai Underwater Supersonic Rail Project
Krishna S
|

Updated on: Jun 22, 2026 | 6:36 PM

Share

మౌలిక సదుపాయాల రంగంలో మానవ మేధస్సుకు సవాలు విసిరే సరికొత్త అద్భుతానికి భారత్, యూఏఈ దేశాలు పునాది వేస్తున్నాయి. అరేబియా సముద్ర గర్భంలో, 200 మీటర్ల లోతున.. ముంబై నుంచి దుబాయ్‌ని కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అండర్ వాటర్ సొరంగ మార్గం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. డీప్ బ్లూ ఎక్స్‌ప్రెస్‌గా పిలిచే ఈ సూపర్‌సోనిక్ రైలు ప్రత్యేకతలు తెలిస్తే ఎవరైన అవాక్కవ్వాల్సిందే. ప్రస్తుతం ముంబై నుంచి దుబాయ్‌కి ఫ్లైట్‌లో వెళ్లాలన్నా కనీసం 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. కానీ అరేబియా సముద్రం అడుగున దాదాపు 2 వేల కిలోమీటర్ల పొడవునా నిర్మించే ఈ అండర్ వాటర్ సొరంగ మార్గం ద్వారా కేవలం 2 గంటల్లోనే ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. ఈ మార్గంలో నడిచే రైళ్లు సాధారణమైనవి కావు. ఇవి గంటకు 600 నుండి 1000 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లే అత్యాధునిక హైపర్‌సోనిక్ లేదా సూపర్‌సోనిక్ సాంకేతికతతో పనిచేస్తాయి.

సముద్ర గర్భంలో అద్భుత ప్రయాణం

ఈ ప్రాజెక్టులో అత్యంత ఆకర్షణీయమైన, ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న అంశం.. పనోరమిక్ విండోస్. సముద్ర మట్టానికి దాదాపు 200 మీటర్ల లోతులో ఈ సొరంగ మార్గం ఉంటుంది. ఈ బుల్లెట్ రైలు కిటికీలు, గోడలు పారదర్శకమైన అద్దాలతో రూపొందిస్తారు. రైలు అత్యంత వేగంగా దూసుకెళ్తున్నప్పుడు ప్రయాణికులు కిటికీల గుండా సముద్రగర్భంలోని తిమింగలాలు, షార్క్‌లు, రంగురంగుల చేపలను, సముద్ర జీవులను నేరుగా వీక్షించవచ్చు. ఇది ప్రయాణికులకు ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియంలో ప్రయాణిస్తున్న ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

 చమురు, మంచినీటి రవాణా కూడా..

ఈ డీప్ బ్లూ ఎక్స్‌ప్రెస్ సొరంగం కేవలం మనుషుల రవాణాకే పరిమితం కాలేదు. ఇరు దేశాల వ్యూహాత్మక, వాణిజ్య అవసరాలను తీర్చేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. యూఏఈ నుంచి భారత్‌కు అవసరమైన ముడి చమురును ఈ సొరంగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పైప్‌లైన్ల ద్వారా వేగంగా రవాణా చేస్తారు. అదే సమయంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉండే దుబాయ్‌కి భారత్ నుండి స్వచ్ఛమైన నీటిని ఈ మార్గం ద్వారానే ఎగుమతి చేస్తారు.

ఇవి కూడా చదవండి

రూ.4 లక్షల కోట్ల బడ్జెట్.. 50 వేల ఉద్యోగాలు

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది. ఈ అండర్ వాటర్ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 50 బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.4 లక్షల కోట్లకు పై మాటే. ఈ భారీ నిర్మాణ రంగం ద్వారా సుమారు 50,000 కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈ రైలు అందుబాటులోకి వస్తే టికెట్ ధరలు ప్రస్తుత విమాన టికెట్ల కంటే దాదాపు 60 శాతం వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది.

కలల ప్రయాణం సాకారమయ్యేది ఎప్పుడు?

ఈ డీప్ బ్లూ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టుకు సంబంధించి భారత్, యూఏఈ ప్రభుత్వాల మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్ డిజైన్లు, సాంకేతిక సాధ్యాసాధ్యాలపై నిపుణుల కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే.. 2030 నాటికి ఈ సముద్ర గర్భ బుల్లెట్ రైలు ప్రయాణం సాకారం కావచ్చని ప్రాజెక్ట్ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us