AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీవ్ర విషాదం.. కుప్పకూలిన వందేళ్లనాటి ఇల్లు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులి ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 100 ఏళ్ల నాటి శిథిలావస్థలో ఉన్న ఇల్లు అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు ఒకే గదిలో నిద్రిస్తుండగా, ఇంటి పైకప్పు కూలిపోవడంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు.

తీవ్ర విషాదం.. కుప్పకూలిన వందేళ్లనాటి ఇల్లు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!
Mahuli Old House
Balaraju Goud
|

Updated on: Aug 06, 2026 | 7:30 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులి ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 100 ఏళ్ల నాటి శిథిలావస్థలో ఉన్న ఇల్లు అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు ఒకే గదిలో నిద్రిస్తుండగా, ఇంటి పైకప్పు కూలిపోవడంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒక కుమారుడు మాత్రమే అదృష్టవశాత్తూ శిథిలాల నుంచి బయటపడి ప్రాణాలతో బయటపడ్డాడు.

మృతుల్లో ప్రమోద్ శ్రీవాస్తవ, ఆయన భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు, భారీ పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

సిటీ కమిషనర్ అశుతోష్ మిశ్రా పర్యవేక్షణలో జేసీబీలు, ఇతర యంత్రాలను ఉపయోగించి శిథిలాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. గంటల తరబడి సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం బాధితులను శిథిలాల నుంచి బయటకు తీసి వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆరుగురు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ప్రమాదానికి గురైన ఇల్లు సుమారు వందేళ్ల నాటిదిగా, చాలా కాలంగా శిథిలావస్థలో ఉందని అధికారులు గుర్తించారు. ఇంట్లో ఒకే గదిలో ఎయిర్ కండిషనర్ ఉండటంతో, బయట భారీ వర్షాలు, తేమ కారణంగా కుటుంబ సభ్యులంతా అదే గదిలో నిద్రించారు. గురువారం తెల్లవారు జామున సుమారు రెండు గంటల సమయంలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

ప్రాథమిక విచారణలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఇంటి గోడలు, పైకప్పు బలహీనపడి కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, ఆ భవనం ప్రమాదకర స్థితిలో ఉందని గతంలో ఎలాంటి ఫిర్యాదులు, హెచ్చరికలు వచ్చాయా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. అదే సమయంలో పరిసర ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వాటి భద్రతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో మహులి ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. వర్షాకాలంలో బలహీనమైన, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us