AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోషకాల కింగ్.. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యితో కలిపి తింటుంటే ఉంటది.. నా సామిరంగ..

ఆంధ్ర, తెలంగాణ వంటకాలలో ఎంతో ప్రత్యేకమైన గోంగూర పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పుల్లటి గోంగూరకు ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్రతో చేసిన మసాలా, ఘుమఘుమలాడే తాలింపు జోడిస్తే రుచి అదిరిపోతుంది. వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. సాధారణంగా తయారుచేసే ఈ వంటకం భోజనానికి మంచి రుచిని అందిస్తుంది.

పోషకాల కింగ్.. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యితో కలిపి తింటుంటే ఉంటది.. నా సామిరంగ..
Gongura Pachadi
Shaik Madar Saheb
|

Updated on: Sep 20, 2026 | 1:15 PM

Share

గోంగూర పచ్చడి దక్షిణ భారత వంటకాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, ఒక ప్రముఖమైన, నోరూరించే వంటకం.. దీని పుల్లని రుచి, ఘాటైన తాలింపు కలయిక ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. గోంగూర పచ్చడి మంచిగా చేస్తే.. కేవలం పది నిమిషాల్లోనే రుచికరంగా తయారుచేసుకోవచ్చు.. గోంగూరలో ఐరన్, కాల్షియం, విటమిన్లు A, B, C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. అంతేకాకుండా ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి.. ఇవి పలు సమస్యలకు నివారణిగా పనిచేస్తాయి..  అందుకే.. గోంగూరను రెగ్యులర్‌గా తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. అయితే.. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యితో కలిపి ఈ పచ్చడిని తింటే అదిరిపోయే రుచిని ఆస్వాదించవచ్చు. ఈ కథనంలో సులభమైన, సాంప్రదాయ గోంగూర పచ్చడి తయారీ విధానాన్ని వివరంగా తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

  • గోంగూర – 2-4 కట్టలు (మీడియం సైజు)
  • ఎండుమిర్చి – 15
  • ధనియాలు – 1 టీ స్పూన్
  • జీలకర్ర – 1 టీ స్పూన్
  • పచ్చిశనగపప్పు – 1 టేబుల్ స్పూన్
  • కరివేపాకు – 2 రెమ్మలు
  • వెల్లుల్లి రెబ్బలు – 10 (రుబ్బడానికి 6, తాలింపునకు 4)
  • పల్లి నూనె – 3 టేబుల్ స్పూన్లు (పచ్చడికి పల్లి నూనె రుచిగా ఉంటుంది)
  • తాలింపు గింజలు – 1 టీ స్పూన్
  • ఇంగువ – 1/4 టీ స్పూన్
  • ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం:

దినుసులు వేయించుకోవడం: ముందుగా, స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పల్లి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక, ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాలు, 15 ఎండుమిరపకాయలు (తుంచుకుని వేసుకోవాలి), రెండు రెమ్మల కరివేపాకు వేయాలి. వీటిని లో ఫ్లేమ్‌లో ఎర్రగా, మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయల కారం మీ రుచికి తగినట్లుగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

గోంగూర ఉడికించడం: ఇప్పుడు అదే పాన్‌లో ఐదు మీడియం సైజు కట్టల గోంగూరను వేయాలి. గోంగూరను వలిచి, మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి నీరు లేకుండా వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో గోంగూర దగ్గరగా అయ్యేంత వరకు సుమారు 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. గోంగూర బాగా ఉడికి, మెత్తగా దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

పచ్చడిని రుబ్బుకోవడం: మిక్సీ జార్‌లోని వేయించిన దినుసులతో పాటు, ఆరు వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని ముందుగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన గోంగూరను కూడా అదే జార్‌లోకి వేసి, కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. గోంగూర పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకుంటేనే రుచి బాగుంటుంది, ఇది పంటికి తగులుతూ మరింత ఆకలి పుట్టిస్తుంది.

తాలింపు సిద్ధం చేయడం: ఇప్పుడు స్టవ్ మీద మరో చిన్న పాన్ లేదా గిన్నె పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల పల్లి నూనె వేసుకోవాలి. ఈ పచ్చడికి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది, అది నిల్వ ఉండటానికి కూడా సహాయపడుతుంది. నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ తాలింపు గింజలు (ఆవాలు, మినపప్పు కలిపి), పావు టీ స్పూన్ ఇంగువ వేసి చిటపటలాడే వరకు వేయించాలి. తర్వాత దంచిన ఆరు వెల్లుల్లి రెబ్బలు (ఇది రుచికి చాలా ముఖ్యం), రెండు ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి.

తాలింపుతో కలపడం: తాలింపు అంతా బాగా వేగిన తర్వాత, ముందుగా రుబ్బి పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడిని అందులో వేయాలి. తాలింపులో పచ్చడిని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పచ్చడికి తాలింపు రుచి చక్కగా పడుతుంది.

ఇప్పుడు, ఎంతో రుచికరమైన, నోరూరించే గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తినడానికి సిద్ధంగా ఉంది. ఈ పచ్చడిని చల్లారిన తర్వాత ఏదైనా గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ సులభమైన రెసిపీతో మీ ఇంట్లో రుచిగా గోంగూర పచ్చడిని ఆస్వాదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us