IT Jobs 2025: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. టెక్ ఇండస్ట్రీలో రెట్టింపు కానున్న నియామకాలు!
ఇండియన్ టెక్ ఇండస్ట్రీ దూసుకుపోతుంది. గత ఏడాదిన్నరగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో మరింత పుంజుకోనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనుంది. దాదాపు 1.25 లక్షల కొత్త ఉద్యోగాలను ఈ రంగంలో సృష్టించనున్నట్లు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడించింది..

ఇండియన్ టెక్ ఇండస్ట్రీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనుంది. దాదాపు 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో 60 వేలు మాత్రమే ఉన్న ఉద్యోగాలు ఈ ఏడాది ఏకంగా 1.25 లక్షలకు పెరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ రంగంలో దాదాపు 58 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అమెరికా, యూరప్‌లోని కీలక మార్కెట్లలో స్థూల ఆర్థిక మందగమనం వల్ల ఏర్పడిన ఒత్తిడి నుండి బయటపడి, ఏడాదిన్నర తర్వాత ఐటీ పరిశ్రమ డిమాండ్‌లో తిరిగి పుంజుకుంది. ఈ తరుణంలో టెక్ ఇండస్ట్రీ మళ్లీ గాడిన పడినట్లు తెలుస్తుంది.
అయితే నాస్కామ్ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.50 లక్షల ఉద్యోగ నియామకాలు ఉంటాయని, 2024 ఆర్థిక సంవత్సరంలో టెక్ రంగంలో 54.30 లక్షల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా వేసింది. ప్రస్తుతం ఆ సంఖ్యను 56.74 లక్షలకు సవరించింది. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇండియా టెక్నాలజీ ఇండస్ట్రీ ఆదాయం 300 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 2025 ఆర్ధిక సంవత్సరానికి భారత్ టెక్ పరిశ్రమ 5.1 శాతం వృద్ధి సాధిస్తుందని నాస్కామ్ అంచనా వేసింది. దీంతో ఈ రంగంలో మొత్తం ఆదాయం 282.6 బిలియన్ డాలర్టకు పైగా పెరిగింది.
మెరుగైన ఏఐ టెక్నీలజీ ఇంప్లిమెంటేషన్, ఏజెంటిక్ ఏఐ పెరుగుదల, జీసీసీల్లో పెరుగుతున్న పరిపక్వత పరిశ్రమ గతిశీలతను పునర్నిర్మిస్తున్నాయని నాస్కామ్ చైర్‌పర్సన్ సింధు గంగాధరన్ అన్నారు. కీలకమైన వృద్ధి కేంద్రాలుగా ఉద్భవించిన ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D), గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC), BPM వంటి ఉప రంగాలు అంతటా విస్తరిస్తున్నాయి. డిజిటల్ ఇంజనీరింగ్ BFSI, హెల్త్‌కేర్, రిటైల్ వంటి రంగాలలోకి విస్తరిస్తోంది. దాదాపు మూడింట రెండు వంతుల పెద్ద ఒప్పందాలు ఈ మార్పు చుట్టూ కేంద్రీకృతమై ఉన్నట్లు నాస్కామ్ తాజా నివేదిక వెల్లడించింది. 2024లో టెక్ పరిశ్రమలో 1750కి పైగా GCCలు ఉన్నాయి. ఇది అధిక-విలువ సేవలు, ప్రొడక్ట్ ఇంజనీరింగ్‌పై పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








