GDP: పరుగులు తీయనున్న భారత్ జీడీపీ.. ప్రపంచ స్థాయి సంస్థల అంచానా.. ఏ సంస్థ ఎంత అంచనా వేస్తోందంటే..
మన దేశ ఆర్ధిక వ్యవస్థ పై శుభ సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు 9% చొప్పున వృద్ధి చెందుతుంది.
GDP: మన దేశ ఆర్ధిక వ్యవస్థ పై శుభ సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు 9% చొప్పున వృద్ధి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అంచనాల్లోనూ, ప్రభుత్వ అంచనాల్లోనూ ఈ విషయం చెబుతున్నారు. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కరోనా నియంత్రణపై నిరంతరం దృష్టి పెట్టడం.. ప్రైవేట్ రంగంలోనూ..ప్రభుత్వ రంగాల్లోనూ ఖర్చులు జరుగుతుండడం అదేవిధంగా గృహ నిర్మాణంలో పెట్టుబడులు పెరగడం వంటి కారణాలు ఉన్నాయి.
గోల్డ్‌మేన్ అంచనాలు 9.1%
2021-22లో దేశ జీడీపీ(GDP) వృద్ధి 9.1%గా ఉండవచ్చని ప్రపంచ ప్రఖ్యాత బ్రోకరేజ్ హౌస్ గోల్డ్‌మేన్ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన, ఇది 8%తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇది 2021లో 8% ఉండగా, 2020లో 7%కి తగ్గింది. జీడీపీ వృద్ధికి కారణం ప్రభుత్వం నిరంతరం ఖర్చు చేయడం.. ప్రైవేట్ కార్పొరేట్లు ఖర్చు చేయడం. అదే సమయంలో, గృహ పెట్టుబడి కూడా మెరుగుపడుతోందని గోల్డ్‌మేన్ చెబుతోంది.
అభివృద్ధిలో వినియోగం అతిపెద్ద కారణం
2022లో జీడీపీ వృద్ధికి వినియోగం ప్రధాన కారకంగా ఉంటుందని గోల్డ్‌మేన్ చెప్పింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తెరుచుకుంది. కరోనా పరిస్థితి అదుపులో ఉంది. రెపో రేటును పెంచడంపై రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు ఆలోచించవచ్చని పేర్కొంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు రేట్లు పెంచాలని యోచిస్తున్నాయి. 2022లో రెపో రేటులో 75 బేసిస్ పాయింట్లు (0.75%) పెరిగే అవకాశం ఉంది.
ఆర్థిక వ్యవస్థ 8.1 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఎస్బీఐ అంచనా!
రెండవ త్రైమాసికంలో భారతదేశ జీడీపీ 8.1% చొప్పున వృద్ధి చెందవచ్చని దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్యకాంతి ఘోష్ అన్నారు. అయితే, మొత్తం సంవత్సరానికి అంటే ఏప్రిల్ 2021- మార్చి 2022 మధ్య GDP వృద్ధి 9.3 నుండి 9.6% ఉండవచ్చు. ఈ కాలంలో వాస్తవ జీడీపీ రూ.2.4 లక్షల కోట్లు పెరిగి రూ.145.69 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. జనాభాలో ఎక్కువ భాగం టీకాలు వేయడమే దీనికి కారణంగా ఎస్బీఐ చెబుతోంది.
ఆర్బీఐ అంచనా 9.5%
రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా పూర్తి సంవత్సరానికి జీడీపీ(GDP) వృద్ధిని 9.5%గా అంచనా వేసింది. భారతదేశంలో కరోనా కేసులు చాలా తక్కువ. కరోనా బారిన పడిన టాప్ 15 దేశాల్లో భారత్‌లో అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయని నివేదికలో పేర్కొంది. భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసులు 1.24 లక్షలు. ఇది జూన్ 2020తో పోలిస్తే తక్కువ. నివేదిక ప్రకారం అమెరికా, చైనా వంటి దేశాల జీడీపీ భారత్ కంటే తక్కువగా ఉంది. ఈ దేశాల నుంచి ఇప్పటివరకు వచ్చిన జీడీపీ గణాంకాల్లో మూడో త్రైమాసికంలో అమెరికా వృద్ధి 4.9% మాత్రమే కాగా, చైనా వృద్ధి 4.9% గా ఉంది.
వృద్ధి 7.9 శాతం ఉంటుందన్న ఇక్రా..
రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రభుత్వం ఖర్చులను నిరంతరం పెంచడం వల్ల 2021-22లో GDP వృద్ధి 7.9%గా ఉండవచ్చని పేర్కొంది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో 7.7% వృద్ధిని అంచనా వేసింది. పారిశ్రామిక- సేవల రంగం నుంచి ఆర్థిక కార్యకలాపాలకు మరింత సహాయం లభిస్తుందని ఈ ఏజెన్సీ తెలిపింది.
ప్రపంచ బ్యాంకు అంచనా 8.3%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు 8.3% చొప్పున పెరగవచ్చని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రోత్సాహకాలు తయారీ రంగానికి ఊతమిస్తాయి. ఈ వృద్ధికి సేవల రంగం ముందుంటుందని తాజా నివేదిక చెబుతోంది. ప్రోత్సాహకం అంటే ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పత్తికి సంబంధించిన ప్రోత్సాహకాలు. ఇందులో 11 రంగాలు ఈ ప్రయోజనం పొందుతాయి. ఇవన్నీ తయారీ రంగాలు.
యూబీఎస్ సెక్యూరిటీస్ వృద్ధి రేటు 9.5%గా పేర్కొంది..
భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 9.5%గా ఉండవచ్చని ప్రపంచ ప్రఖ్యాత బ్రోకరేజ్ హౌస్ యూబీఎస్ సెక్యూరిటీస్ తెలిపింది. అంతకుముందు ఇది 8.9%గా అంచనా వేశారు. అయితే, 2023 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.7%గా ఉండవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం తక్కువగా ఉన్న వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభమవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ తన పాలసీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ 20.1% చొప్పున వృద్ధి చెందింది.
ఫిచ్ అంచనా అందరిలాగే ఉంది
రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా కూడా ఈ అంచనాల మాదిరిగానే ఉంది. ఆర్ధిక సంవత్సరం 22లో 8.7% వృద్ధిని అంచనా వేసింది. అయితే, వచ్చే ఏడాది అంటే ఆర్ధిక సంవత్సరం 23(FY 2023)లో, ఈ వృద్ధి దాదాపు 10% ఉండవచ్చు. వచ్చే మూడేళ్లలో భారతదేశ సగటు వృద్ధిరేటు 7%గా ఉండవచ్చని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 10.5% ఉండవచ్చని భారత ప్రభుత్వం తన అంచనాలో పేర్కొంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు వృద్ధి 7 నుండి 7.5% మధ్య ఉండవచ్చని ఆర్థిక సలహా మండలి తెలిపింది. వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరించడంపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు.
ఇవి కూడా చదవండి: Hira Horse: వామ్మో.. ఈ ఖరీదైన గుర్రం ఎన్ని లీటర్ల పాలు తాగుతుందో తెలిస్తే గుండెలదిరిపోతాయి!