Agriculture laws: వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఎలా ఉపసంహరించుకుంటుంది.. ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తి కావచ్చు? తెలుసుకోండి!
గత ఏడాది కాలంగా రైతుల ఆందోళనకు కారణమైన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్టాల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రధాని మోడీ చెప్పారు.
Agriculture laws: గత ఏడాది కాలంగా రైతుల ఆందోళనకు కారణమైన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 19న దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ పెద్ద ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్టాల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రధాని చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కనీసం 3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. నవంబర్ 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంటే, ఈ రోజు నుండి 7 రోజుల తర్వాత చట్టం ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించడానికి జరుగుతున్న ప్రయత్నాల నేపధ్యంలో ఏదైనా చట్టం ఎలా ఉపసంహరించుకుంటారు? పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని అనుసరిస్తుంది? సుప్రీంకోర్టు ద్వారా కూడా చట్టాలను ఉపసంహరించుకునే అవకాశం ఉందా? మూడు వ్యవసాయ చట్టాలు ఏమిటి? ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది, రైతులు ఎందుకు నిరసనలు తెలిపారు? వంటి అంశాలను తెలుసుకుందాం.
వ్యవసాయ చట్టాలు ఎలా ఉపసంహరించుకుంటారు?
ఏదైనా చట్టాన్ని ఉపసంహరించుకునే ప్రక్రియ కూడా కొత్తగా చట్టం చేసిన విధంగానే ఉంటుంది. ముందుగా పార్లమెంట్ ఉభయ సభల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. మెజారిటీ ప్రాతిపదికన ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించవలసి ఉంటుంది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. దానిపై రాష్ట్రపతి తన ముద్ర వేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ముద్ర తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే వ్యవసాయ చట్టాలు రద్దు అవుతాయి.
ప్రభుత్వం మరో విధంగా కూడా ఈ పని చేయవచ్చు. సుప్రీంకోర్టు ద్వారా కూడా చట్టాన్ని ఉపసంహరించుకునే అవకాశమూ ఉంది. ప్రస్తుతం వ్యవసాయ చట్టాల విషయం సుప్రీం కోర్టు పరిశీలనలో కూడా ఉంది. ప్రభుత్వం కోరుకుంటే, ప్రత్యామ్నాయంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడం ద్వారా, ఈ చట్టాలను రద్దు చేయడానికి తన సమ్మతిని ఇవ్వవచ్చు. ఆ తర్వాత సుప్రీంకోర్టు తన న్యాయపరమైన ఉత్తర్వు ద్వారా కూడా చట్టాలను రద్దు చేయవచ్చు.
మూడు వ్యవసాయ చట్టాలు.. వాటిపై రైతుల వ్యతిరేకతకు కారణాలు ఇవే..
1. రైతు ఉత్పత్తి-వాణిజ్యం చట్టం
ప్రభుత్వ వాదన
రైతుల ఉత్పత్తులను విక్రయించే అవకాశాలను పెంచాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ చట్టం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను మండీల వెలుపల ప్రైవేట్ కొనుగోలుదారులకు అధిక ధరలకు విక్రయించుకోగలుగుతారు.
రైతు వాదన
పెద్ద కార్పొరేట్ కొనుగోలుదారులకు చట్టం స్వేచ్ఛనిచ్చింది. ఈ బహిరంగ మినహాయింపు రాబోయే కాలంలో మండీల ఔచిత్యాన్ని అంతం చేస్తుంది. మార్కెట్‌లో కొరత ఉంటే తొలగించాలని, మార్కెట్ వ్యవస్థను చక్కదిద్దాలని చట్టాల్లో ఎక్కడా చెప్పలేదని రైతులు తెలిపారు.
2. వ్యవసాయం (సాధికారత- రక్షణ) ధర హామీ- వ్యవసాయ సేవల ఒప్పందం
ప్రభుత్వం వాదన
ప్రభుత్వ లాజిక్ వల్ల రైతులు, ప్రైవేట్ కంపెనీల మధ్య కాంట్రాక్టు వ్యవసాయానికి మార్గం తెరుస్తుంది. మీ భూమిని కొంత మొత్తానికి కాంట్రాక్టర్ కిరాయికి తీసుకుని దాని ప్రకారం పంటను ఉత్పత్తి చేసి మార్కెట్‌లో విక్రయిస్తారు.
రైతుల వాదన
కాంట్రాక్టు వ్యవసాయం రైతులను బండెడ్ లేబర్‌గా మారుస్తుంది. నిరక్షరాస్యులైన రైతులు ఒప్పంద వ్యవసాయ నిబంధనలలో చిక్కుకుపోతారు. అలాగే రైతుకు, కాంట్రాక్టర్‌కు మధ్య ఏదైనా వివాదం ఏర్పడితే, అప్పుడు రైతు పక్షం బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే, కాంట్రాక్టర్ ఖర్చుతో కూడిన న్యాయవాది సహాయంతో న్యాయస్థానాల్లో పోరాడ గలడు. ఇక్కడ రైతుకు అన్యాయం జరిగితే ప్రశ్నించే అవకాశం ఉండదు.
3. రైతు ఉత్పత్తి నిల్వ – వాణిజ్యం
ప్రభుత్వం వాదన
వ్యవసాయ ఉత్పత్తులను డిపాజిట్ చేసేందుకు ప్రైవేట్ పెట్టుబడులకు మినహాయింపు ఉంటుందని, సరైన ధర వచ్చినప్పుడే రైతులు పంటను అమ్ముకుంటారన్నది ప్రభుత్వ వాదన . అంటే రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకుని సరైన ధర వచ్చినప్పుడే విక్రయించుకోగలుగుతారు.
రైతుల వాదన
దీంతో హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌కు ప్రోత్సాహం లభిస్తుందన్నది రైతుల వాదన. చాలా మంది రైతులకు పంట నిల్వ చేసేందుకు స్థలం లేదు. దీనితో పాటు రైతులకు తదుపరి పంటకు కూడా నగదు అవసరం అవుతుంది. అటువంటి పరిస్థితిలో పంటను అమ్మకుండా నిలువ చేసుకోవడం కష్టం. వ్యవసాయోత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ప్రయివేటు పెట్టుబడికి మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఎవరి వద్ద ఎంత నిల్వ ఉందో తెలియకుండా పోతుంది.
ఇవి కూడా చదవండి: Andhra Pradesh: ఏపీ థియేటర్లలో ఇక నుంచి రోజుకు 4 షోలు మాత్రమే.. ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్లు
ISIS Magazine: ISIS ఆన్‌లైన్ మ్యాగజైన్ పోస్టర్ వివాదం.. భద్రతా పెంచిన కన్నడ ప్రభుత్వం