Onions: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం.. కారణం ఇదే
వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దేశీయంగా ఉల్లి (Onion) అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉల్లిపాయల ఎగుమతులను వచ్చే ఏడాది మార్చి 31 వరకు నిషేదిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారం (డిసెంబరు 8) నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. వినియోగదారులకు ఉపశమనం కలిగించే దిశగా కేంద్రం ఈ మేరకు..
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దేశీయంగా ఉల్లి (Onion) అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉల్లిపాయల ఎగుమతులను వచ్చే ఏడాది మార్చి 31 వరకు నిషేదిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారం (డిసెంబరు 8) నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. వినియోగదారులకు ఉపశమనం కలిగించే దిశగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఆ ప్రకారంగా విదేశాలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అనుమతి ఆధారంగా ఉల్లి ఎగుమతులు అనుమతించబడినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) తెలిపింది. అయితే, ఇందులో కొన్ని మినహాయింపులు కల్పించింది. ఈ నోటిఫికేషన్‌కు ముందే ఓడల్లో లోడ్ అయిన ఉల్లిని, ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లి లోడ్‌ను ఎగుమతి చేసుకోవచ్చని DGFT వెల్లడించింది. అయితే, ఇతర దేశాల అభ్యర్థనల మేరకు భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్‌కు ముందే ఉల్లిపాయల సరుకులను కస్టమ్స్‌కు అప్పగించి, వారి సిస్టమ్‌లో రిజిస్టర్ చేయబడి ఉంటే లేదా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌లో నమోదు చేయబడి ఉంటే అటువంటి ఉల్లిపాయల ఎగుమతులకు అనుమతి ఉంటుంది. డిసెంబరు 8కి ముందు స్టేషన్‌లోకి ప్రవేశించిన ఈ వస్తువుల తేదీ, సమయం స్టాంపింగ్ ఆధారంగా ఆ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
అటువంటి సరుకుల ఎగుమతికి వచ్చే ఏడాది జనవరి 5 వరకు అనుమతి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు దేశం నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లిపాయలు ఎగుమతి అయ్యాయి. బంగ్లాదేశ్, మలేషియా, UAE దేశాలు దేశీయ ఉల్లిని దిగుమతి చేసుకున్నాయి. కాగా ఖరీఫ్ సీజన్‌లో ఉల్లి నిల్వలు తగ్గడంతో ఉల్లి ధరలు పెరగడం ప్రారంభించాయి. నవంబర్ 14న విడుదల చేసిన డబ్ల్యుపీఐ డేటా ప్రకారం.. కూరగాయలు, బంగాళదుంపల ద్రవ్యోల్బణం వరుసగా -21.04 శాతం, -29.27 శాతంగా ఉన్నాయి. ఉల్లి ధర పెరుగుదల వార్షిక రేటు 62.60 శాతం వద్ద గరిష్టంగా కొనసాగుతోంది.
ప్రస్తుతం దేశ రాజధానిలో స్థానిక వ్యాపారులు కిలో ఉల్లిని రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం గతంలో అనేక చర్యలు తీసుకుంది. రిటైల్ మార్కెట్‌లలో బఫర్ పథకం కింద కిలోకు రూ.25 సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయించాలని కేంద్రం ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఆ తర్వాత అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం టన్నుకు కనిష్ట ఎగుమతి ధర (ఎంఈపీ) 800 డాలర్లుగా నిర్ణయించింది. తాజాగా ఎగుమతులపై వచ్చే ఏడాది మార్చి నెలాకరు వరకు నిషేధం విధిస్తూ ప్రకటన వెలువరించింది
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.