Cyclone Michaung: తుపాను దెబ్బకు నీటి కుండను తలపిస్తోన్న తమిళనాడు.. కొనసాగుతోన్న సహాయక చర్యలు
మిచౌంగ్ తుపానుకు చెన్నై చిగురుటాకులా వణికిపోతుంది. నగరంలోని అనేక ప్రాంతాలకు వరద నీరు పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కేబుల్స్ నీట మునగడంతో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. తుపాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేలచ్చేరి, తాంబరం తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని..
చెన్నై, డిసెంబర్ 7: మిచౌంగ్ తుపానుకు చెన్నై చిగురుటాకులా వణికిపోతుంది. నగరంలోని అనేక ప్రాంతాలకు వరద నీరు పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కేబుల్స్ నీట మునగడంతో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. తుపాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేలచ్చేరి, తాంబరం తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని స్థానిక నివాసితులు మీడియాకు వివరించారు. నగరంలోని 30కి పైగా దుకాణాలు నీటమునిగిపోయాయని చెన్నైలోని కొలత్తూరులో దుకాణదారుడు రాజారాం తెలిపారు. గత రెండు రోజులుగా కరెంటు లేదు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న వెయ్యికి పైగా చేపలు చనిపోయాయి. దీని వల్ల రూ.3-5 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు.
‘మా ప్రాంతం పూర్తిగా ముంపునకు గురైంది. ప్రభుత్వం సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ ఆహారం, నీరు, ప్రాథమిక అవసరాలు ఏర్పాటు చేవారు. శిబిరంలో రోజంతా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. గణేశపురం, ఆస్టిన్ నగర్, బక్స్ రోడ్‌కు ప్రభుత్వం ఆహారాన్ని సరఫరా చేస్తోంది. రాధాకృష్ణాపురంలో నీటి మట్టం తగ్గలేదు. అక్కడి నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సహాయక శిబిరంలో ఉన్న పార్వతి అనే మహిళ అక్కడి పరిస్థితిని చెప్పుకొచ్చింది.’మా ఇల్లు రాధాకృష్ణశాలలో ఉంది. ఆ ప్రాంతం పూర్తిగా నీటిలో ఉంది. కానీ ప్రాణనష్టం జరగలేదు. అక్కడ భారీ మొత్తంలో నీరు నిలిచి ఉందని’ సహాయ శిబిరంలో ఆశ్రయం పొందిన సేన్‌బాగం అనే వ్యక్తి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతంలోని ప్రజలు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని, వారందరినీ సమీపంలోని సహాయ శిబిరానికి తరలించారని, అక్కడ వారికి ఆహారం, నీరు, ఇతర నిత్యావసరాలను అందిస్తున్నట్లు సెన్‌బాగం తెలిపారు. కిల్‌పోక్, కట్టుపాక్కం సహా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు.
మరోవైపు వదర ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పడవలను ఉపయోగించి వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రభుత్వం తెలిపింది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌లోని సీనియర్ అధికారులు రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారని పౌర సంస్థ తెలిపింది. ప్రజల కోసం పోలీసు హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా ప్రకటించారు. నగరంలో చాలా చోట్ల నీటిని ఒడిసిపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, తాగునీటి సరఫరాతో పాటు నీటి ఎద్దడి ఉన్న రోడ్లను కూడా శుభ్రం చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా మీడియాకు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సిబ్బంది సహాయక, పునరావాస పనులు నిర్వహిస్తున్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఆహార పొట్లాలు, బ్రెడ్, పాలు పంపిణీ చేస్తున్నారు. పెరుంబాక్కం, వరదరాజపురంలలో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలకు పడవలను పంపించామని, సీనియర్ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.