Electric Scooter: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జింగ్‌తో 95 కిలోమీటర్ల మైలేజ్..!
Electric Scooter: వివిధ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అంతర్జాతీయ..
Electric Scooter: వివిధ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అంతర్జాతీయ సంస్థలు ఎంతో ఆసక్తి చూపుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన హుస్క్వర్నా మోటార్ సైకిల్స్ కూడా చేరింది. ఈ సంస్థ 2018లో 6.7-HP మినీబైక్‌ను తయారు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ-పిలెన్ (E-Pilen) అనే బైక్‌తో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల విభాగంలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించింది. తాజాగా వెక్టార్ మోడల్‌తో కొత్త బ్యాటరీ స్కూటర్‌ను సంస్థ ఆవిష్కరించింది.
ఈ సంస్థ తమ బ్రాండ్ పేరుతో ఆవిష్కరించిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. పట్టణ ప్రాంతాల వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్‌ను రూపొందించారు. నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు, పెరుగుతున్న ఇంధన ధరలకు ఈ బైక్ చెక్ పెట్టనుందని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ వెక్టార్ స్కూటర్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. సుమారు 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుందని కంపెనీ చెబుతోంది.
కంపెనీనీ మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు..
హుస్క్వర్నా కంపెనీ భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగాన్ని విస్తరించాలని సంస్థ భావిస్తోంది. రానున్న రోజుల్లో బ్యాటరీ వాహనాలకు ఏర్పడే డిమాండ్‌పై సంస్థ ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టింది. జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలలోని కొత్త డీలర్లతో కూడా ఒప్పందాలు చేసుకుంటోంది. అయితే హుస్క్వర్నా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ వెక్టర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారో అనే విషయాన్ని వెల్లడించలేదు. దీన్ని 2022లో విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మార్కెట్లోకి విడుదల ఎప్పుడు?
వెక్టార్ మోడల్ ఉత్పత్తికి రెడీగా ఉంది. కానీ ఈ ద్విచక్ర వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్లు, టెక్నికల్ స్పెసిఫికేషన్లను సంస్థ ఇంకా వెల్లడించలేదు. వెక్టార్ స్కూటర్‌పై అత్యధికంగా 30 మైళ్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీంతో పాటు పూర్తిగా ఛార్జ్ చేసిన తరువాత 60 మైళ్ల వరకు ప్రయాణం చేయవచ్చని సమాచారం.