Gold Rates: బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. పసిడి ధరలను ఎలా ప్రభావితం చేస్తుంది?
Gold Rates: బంగారంపై మొత్తం దిగుమతి సుంకం 15 శాతానికి చేరుకుంది. బంగారం దిగుమతులను కట్టడి చేయడంతో పాటు పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటును నియంత్రించేందుకు దిగుమతి సుంకాన్ని పెంచినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.
Gold Rates: బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం జూలై 1న ప్రకటించడం తెలిసిందే. ఇప్పటికే బంగారంపై 2.5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్ (AIDC) కూడా విధిస్తున్నారు. దీంతో బంగారంపై మొత్తం దిగుమతి సుంకం 15 శాతానికి చేరుకుంది. బంగారం దిగుమతులను కట్టడి చేయడంతో పాటు పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటును నియంత్రించేందుకు దిగుమతి సుంకాన్ని పెంచినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.
ఈ ప్రకటన వెలువడగానే దేశంలో బంగారం ధరలు పెరిగాయి. MCX వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం ధర ఏప్రిల్ 29 తర్వాత మొదటిసారిగా జూలై 1న రూ. 52,000-మార్కును దాటింది. ఇది రెండు నెలల గరిష్ఠ స్థాయి. అయితే డాలర్ బలపడటంతో గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ జూలై 8న బంగారం ధర రూ.50,677గా ఉంది. ఆర్థిక మాంధ్యం రావచ్చన్న భయాలు కూడా బంగారం ధరను ప్రభావితం చేస్తున్నాయి.
బంగారంపై దిగుమతి సుంకాన్ని ఎందుకు పెంచారు?
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. మే, జూన్ నెలల్లో దేశానికి బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. మే నెలలో భారతీయ బంగారం దిగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 790 శాతం పెరిగి 107 టన్నులుగా నమోదయ్యాయి. దేశ అవసరాలకు బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకోవడం చాలా సమస్యాత్మకంగా పరిణమిస్తోంది. 2021లో గత 10 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది.
పిసిడి దిగుమతులు భారీగా పెరగడంతో కరెంట్ ఖాతా లోటు (CAD) కూడా పెరుగుతుంది.దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే CADతో పోరాడుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 0.9 శాతం మిగులుతో పోలిస్తే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశం 1.2 శాతం లోటును నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ CAD.. GDPలో 3.1 శాతం వరకు పెరగవచ్చని ఫిచ్ రేటింగ్స్ గతంలో ఒక నివేదికలో అంచనావేసింది. పెరుగుతున్న CAD కూడా కరెన్సీ తరుగుదలకు దారి తీస్తుంది. గత నెల రోజులుగా రూపాయి మారకం విలువ నేలచూపులు చూస్తోంది. డాలర్‌తో పోల్చితే ఇప్పటికే ఆల్ టైమ్ కనిష్ట స్థాయిలను తాకింది. జూలై 5న రూపాయి US డాలర్‌తో పోలిస్తే 79.38కి చేరుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే సమీప భవిష్యత్తులో రూపాయి మారకం విలువ 82 డాలర్లకు పడిపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.
రూపాయి మారకం విలువ పతనాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఐల నుంచి డాలర్ల ప్రవాహాన్ని అనుమతించే పలు నిబంధనలను ఆర్‌బిఐ సడలించింది. ఇందులో భాగంగానే బంగారం దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
బంగారంపై దిగుమతి సుంకం పెంపు కారణంగా దేశంలో బంగారు ఆభరణాల ధరలు పెరగనున్నాయి. సాధారణంగా ప్రస్తుత బంగారం ధరకు దిగుమతి సుంకాన్ని వ్యాపారులు అదనంగా చేరుస్తారు. దిగుమతి సుంకం పెరగడంతో ఆ భారాన్ని కూడా వినియోగదారులే మోయాల్సి ఉంటుంది. ఆ రకంగా భారతీయ కొనుగోలుదారులకు బంగారం మరింత ప్రియంగా మారుతుంది.
జూలై 18 నుండి కట్ మరియు పాలిష్ చేసిన వజ్రాలపై GST రేటు 0.25 శాతం నుండి 1.5 శాతానికి పెంపుతో వజ్రాభరణాలు చాలా ఖరీదైనవిగా మారవచ్చు.
గత రెండేళ్లలో బంగారం ధరలు ఇలా..
కరోనా (కోవిడ్ -19) మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి దేశంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. మార్చి 2020లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 41,000 – రూ. 43,000 మధ్య ఉంది. ఇది జూలై 2020లో రూ.50,000 మార్క్‌ని దాటింది. ఆగస్ట్ 2020లో బంగారం ధర రూ. 56,000 ఆల్ టైమ్ హైని తాకింది. ప్రస్తుతం ఇది దాదాపు రూ. 51,000కి తగ్గింది. దిగుమతి సుంకం పెంపుతో ముందు ముందు పసిరి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..