Money: లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకున్నారా.? ఇలా చేస్తే ఒక్క రూపాయ్ కూడా కట్టనవసరం లేదు..
లోన్ యాప్‌ల వేధింపులకు గురవుతున్నారా? అక్రమ రుణ యాప్‌లు ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేని యాప్‌లు అక్రమం. వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా..

ఈ డిజిటల్ యుగంలో ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి అనేక డిజిటల్ లెండింగ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వీటిలో చాలా వరకు అక్రమ యాప్‌లు ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయితే హైకోర్టు అడ్వకేట్ లోన్ యాప్‌ల చట్టబద్ధత, వాటి వేధింపులు, బాధితులు తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల గురించి వివరించారు.
అక్రమ లోన్ యాప్‌ల కార్యకలాపాలు
ఈ రుణ యాప్‌లలో చాలా వరకు చైనాలో పుట్టినవి. ఎలేజి లోన్, పాండా రుపీస్, ప్లే క్యాష్, టాప్ క్రెడిట్, రిత్యం లైన్, క్రెడిట్ ఫించ్ వంటి అనేక పేర్లతో ఇవి భారతీయ మార్కెట్‌లో విస్తరించాయి. ఎటువంటి షరతులు లేకుండా, తక్షణమే రుణగ్రహీతల ఖాతాలో డబ్బు జమ చేస్తాయి. అయితే, రుణగ్రహీతలకు ఈ రుణాల పర్యవసానాలు తెలియవు. రుణం తీసుకున్న తర్వాత, ఈ యాప్‌లు రుణగ్రహీతలను వేధించడం ప్రారంభిస్తాయి. రుణం తిరిగి చెల్లించని పక్షంలో బెదిరింపులు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం, సామాజిక మాధ్యమాలలో పరువు తీయడం వంటి చర్యలకు పాల్పడతాయి. ఈ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన విషాద ఘటనలు కూడా ఉన్నాయి.
చట్టబద్ధమైన రుణదాతలు ఎవరు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారతదేశంలో రుణ కార్యకలాపాలను నియంత్రించే ప్రధాన సంస్థ. ఆర్‌బీఐ అనుమతి పొందిన కమర్షియల్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) మాత్రమే రుణాలు ఇవ్వడానికి చట్టబద్ధంగా అర్హులు. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న అనేక “మాల్‌వేర్” యాప్‌లపై ఎటువంటి నియంత్రణ లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులకూ డిజిటల్ యాప్‌లు ఉన్నప్పటికీ, ఏవి ఒరిజినల్, ఏవి అక్రమం అని గుర్తించడం కష్టం. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, అనుమతులు లేని 27 యాప్‌లను నిషేధించినట్లు తెలిపారు. అక్రమ యాప్‌లను గుర్తించడానికి ఆర్‌బీఐ బ్యాంకులకు లేఖలు కూడా రాసింది.
చట్టపరమైన చర్యలు, శిక్షలు
అక్రమ యాప్‌లు ప్రజల బలహీనతలను దుర్వినియోగం చేసి వేధింపులకు గురిచేస్తున్నాయి. అలాంటి యాప్‌ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఐటీ చట్టం, భారతీయ శిక్షాస్మృతి (IPC) ప్రకారం ఇలాంటి వేధింపులకు శిక్షలు ఉంటాయి. ఆర్‌బీఐ అనుమతి లేకుండా తక్షణ రుణాలు ఇచ్చే యాప్‌లన్నీ చట్టరీత్యా నేరం. వేధింపులకు గురైనప్పుడు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఐపీసీలోని సెక్షన్లు 420 (మోసం), 504 (శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానపరచడం), 507 (అనామక కమ్యూనికేషన్ ద్వారా నేరపూరిత బెదిరింపు), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) లతో పాటు ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 3 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవచ్చు.
పోలీసుల సూచనలు, రక్షణ
రుణాలు కట్టకపోతే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామని, మీ ఫోటోలను దుర్వినియోగం చేస్తామని బెదిరించి పరువు తీయడానికి ప్రయత్నిస్తే, ఐటీ చట్టం సెక్షన్ 3 ప్రకారం కేసులు పెట్టవచ్చు. పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఇలాంటి వేధింపులకు గురైన వారు భయపడకుండా వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. వేధింపులకు గురైన వారు రుణాలు కట్టవలసిన అవసరం లేదని, ఫిర్యాదు చేస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ లోన్ యాప్‌ల వేధింపులకు గురైన వారు నిస్సందేహంగా పోలీసులను ఆశ్రయించాలి. చట్టం వారికి పూర్తి రక్షణ కల్పిస్తుంది. భయం వీడి, న్యాయం కోసం పోరాడటం ద్వారా ఇతరులకు కూడా ఆదర్శంగా నిలవవచ్చు.
