లీటర్ డీజిల్‌కు రైలు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది..? ఈ మైలేజ్ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
సాధారణంగా వాహనాల మైలేజీని 'లీటరుకు ఎన్ని కిలోమీటర్లు అని లెక్కిస్తాం. కానీ భారతీయ రైల్వే విషయంలో ఈ లెక్క పూర్తిగా రివర్స్.. ఇక్కడ కిలోమీటరుకు ఎన్ని లీటర్ల డీజిల్ ఖర్చవుతుందో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. రైలు ఇంజన్ ఇంధన వినియోగం వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్ గురించి తెలుసుకుందాం..

మనం కొత్తగా ఏ వాహనం కొన్నా మొదట అడిగే ప్రశ్న.. మైలేజీ ఎంత ఇస్తుంది?. పెట్రోల్ ధరలు సెంచరీ దాటిన ఈ రోజుల్లో ఒక్క రూపాయి ఆదా అయినా గొప్పే. అయితే రోజూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వే ఇంజన్ల మైలేజీ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఒక లీటరు డీజిల్‌తో రైలు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..
రైలు మైలేజీని ప్రభావితం చేసే అంశాలు
కార్లకు ఉన్నట్లే రైళ్లకు కూడా ఒకే రకమైన మైలేజీ ఉండదు. ఇది ప్రధానంగా కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది..
- రైలులోని కోచ్‌ల సంఖ్య.
- రైలు మోసే మొత్తం బరువు.
- ప్రయాణించే మార్గం
- ట్రాఫిక్ సిగ్నల్స్, వాతావరణం.
లీటరుకు కిలోమీటర్లు కాదు.. కిలోమీటరుకు లీటర్లు
సాధారణంగా వాహనాల మైలేజీని లీటరుకు ఎన్ని కిలోమీటర్లు అని కొలుస్తాం. కానీ రైలు విషయంలో ఇది రివర్స్. ఇక్కడ కిలోమీటరుకు ఎన్ని లీటర్ల డీజిల్ ఖర్చవుతుందో లెక్కిస్తారు.
ప్యాసింజర్ రైలు: 12 కోచ్‌లు ఉన్న ప్యాసింజర్ రైలు 1 కిలోమీటరు* ప్రయాణించడానికి సుమారు 6 లీటర్ల డీజిల్ తాగుతుంది. అంటే కేవలం ఒక లీటరు డీజిల్‌తో ఇది కేవలం 180 నుండి 200 మీటర్లు మాత్రమే వెళ్లగలదు.
ఎక్స్‌ప్రెస్ రైలు: అదే 12 కోచ్‌లు ఉన్న ఎక్స్‌ప్రెస్ లేదా సూపర్‌ఫాస్ట్ రైలు అయితే 1 కిలోమీటరుకు 4.5 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. అంటే లీటరుకు సుమారు 230 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
నెమ్మదిగా వెళ్లే ప్యాసింజర్ రైలుకే ఎక్కువ ఖర్చు.. ఎందుకు?
సాధారణంగా వేగంగా వెళ్తే ఇంధనం ఎక్కువ ఖర్చవుతుందని మనం అనుకుంటాం. కానీ రైళ్ల విషయంలో అది తప్పు. ప్యాసింజర్ రైళ్లు ప్రతి చిన్న స్టేషన్‌లోనూ ఆగుతాయి. రైలును ఆపడానికి బ్రేకులు వేయడం, మళ్లీ సున్నా నుండి వేగాన్ని అందుకోవడానికి ఇంజన్‌పై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల ఇంధనం ఎక్కువ వృధా అవుతుంది. అదే ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకే వేగంతో నిరంతరాయంగా ప్రయాణించడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది.
సరుకు రవాణా రైళ్ల పరిస్థితి ఏంటి?
వందలాది టన్నుల బరువును మోసుకెళ్లే గూడ్స్ రైళ్ల మైలేజీ ఇంకా తక్కువగా ఉంటుంది. కోచ్‌ల సంఖ్య పెరిగే కొద్దీ, లోడ్ ఎక్కువయ్యే కొద్దీ మైలేజీ గణనీయంగా తగ్గిపోతుంది. ఒక అంచనా ప్రకారం, భారీ లోడ్‌తో వెళ్లే గూడ్స్ రైలు ఒక కిలోమీటరుకు దాదాపు 8 నుండి 10 లీటర్ల డీజిల్‌ను వినియోగించవచ్చు.
మరిన్ని ఆసక్తికరమైన నిజాలు:
స్టార్టింగ్ కష్టం: ఒక రైలు ఇంజన్‌ను స్టార్ట్ చేయడానికి సుమారు 25 లీటర్ల డీజిల్ ఖర్చవుతుందని అంటారు. అందుకే రైల్వే యార్డుల్లో ఇంజన్లను తరచుగా ఆపకుండా ఉంచుతారు.
ట్యాంక్ కెపాసిటీ: ఒక రైలు ఇంజన్ డీజిల్ ట్యాంక్ సామర్థ్యం సుమారు 5,000 నుండి 6,000 లీటర్ల వరకు ఉంటుంది.
ఎలక్ట్రిక్ రైళ్లు: ప్రస్తుతం భారతీయ రైల్వే డీజిల్ ఇంజన్ల స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజన్లను ప్రవేశపెడుతోంది. ఇది ఇంధన ఖర్చును భారీగా తగ్గించడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తోంది.
