Atal Pension Yojana: వృద్ధాప్యంలో నెలకు రూ. 5,000 పెన్షన్.. కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న సూపర్ పథకం.. వివరాలు ఇవి
ఈ పథకం కింద నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఇంతకు ముందు, ఈ పథకంలో అన్ని వయసుల వారు.. వారి ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండేది. అయితే ఇటీవల అర్హత విషయంలో పలు మార్పులు చేశారు. ఆదాయ పన్నులు చెల్లించే వ్యక్తులు ఈ పథకానికి అర్హులుకారు.
వృద్ధాప్యంలో ఆర్థిక అండ లేకపోతే మనుగడ సాధించడం కష్టం. అందుకే ప్రభుత్వాలు కూడా వృద్ధాప్య పింఛన్ అందిస్తున్నాయి. అయితే అసంఘటిత రంగంలోని కార్మికులకు వయసు మళ్లిన తర్వాత ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వ ఓ పథకం ద్వారా పింఛన్ అందిస్తోంది. దీనిలో ముందు నుంచే పెట్టుబడి పెడితే వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందులు తప్పుతాయి. ఆ పథకం పేరు అటల్ పెన్షన్ యోజన(ఏపీవై). దీనిని 2015, మే 9న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఇంతకు ముందు, ఈ పథకంలో అన్ని వయసుల వారు.. వారి ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండేది. అయితే ఇటీవల అర్హత విషయంలో పలు మార్పులు చేశారు. ఆదాయ పన్నులు చెల్లించే వ్యక్తులు ఈ పథకానికి అర్హులుకారు. కాగా ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకూ 5 కోట్ల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
నెలకు రూ. 5,000 పెన్షన్..
ఈ పథకంలో ముందు నుంచే పెట్టుబడి పెట్టి.. వృద్ధాప్యంలో పెన్షన్ పొందవచ్చు. వారి వయస్సును బట్టి పెట్టే పెట్టుబడిలో మార్పు ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ పెట్టుబడి మొత్తం కూడా పెరుగుతుంది. నెలకు రూ. 5000 పెన్షన్ పొందడానికి ఎంత పెట్టుబడి పెట్టాలి అనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
- ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో ఏపీవై పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారనుకుందాం. వారి పదవీ విరమణ తర్వాత నెలకు రూ. 5000 పెన్షన్ కావాలంటే, వారు 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా రూ. 210 పెట్టుబడి పెట్టాలి.
- అదే వ్యవధికి నెలకు రూ. 168 మాత్రమే డిపాజిట్ చేయాలని నిర్ణయించుకుంటే, ప్రతి నెలా రూ.4,000 విత్‌డ్రా చేసుకునేందుకు అర్హత ఉంటుంది.
- నెలకు రూ.3,000 పింఛను పొందేందుకు రూ.126 స్వల్ప మొత్తాన్ని ఈ పథకంలో డిపాజిట్ చేయాలి.
- నెలకు రూ.84 చొప్పున డిపాజిట్ చేస్తే.. ఆ వ్యక్తి రూ.1,000 పెన్షన్ పొందవచ్చు.
40ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే..
- 40 ఏళ్ల వ్యక్తి ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, నెలకు రూ. 5,000 పెన్షన్ పొందేందుకు వారు 60 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.1,454 పెట్టుబడి పెట్టాలి.
- అదేవిధంగా, నెలకు రూ. 4,000 పెన్షన్ కావాలంటే పెట్టుబడి మొత్తం రూ.1,164 కడితే సరిపోతోంది.
- అదే నెలకు రూ. 3,000 పెన్షన్ కావాలంటే కేవలం రూ. 873 పెట్టుబడి సరిపోతుంది. నెలకు రూ. 1,000 కోసం పెట్టుబడి పెట్టవలసిన మొత్తం రూ. 582 మాత్రమే
పూర్తి భద్రత.. ప్రతి నెలా వాయిదా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతి 3 లేదా 6 నెలలకు ఒకసారి సంచిత వాయిదాల చెల్లింపును ఎంచుకోవచ్చు. పథకం చందాదారుడు మరణిస్తే, జీవిత భాగస్వామికి పెన్షన్ ఇస్తారు. ఇద్దరూ చనిపోతే, నామినీ బ్యాంకు ఖాతాలో మొత్తం జమ చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..