ATM service charges: సర్వీస్ చార్జ్ పడకుండా ఏటీఎం నుంచి ఎన్నిసార్లైనా నగదు విత్ డ్రా చేయడం ఎలా? ఇదిగో ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
ప్రధాన బ్యాంకులు ప్రతి నెలా పరిమిత సంఖ్యలో ఉచితంగా ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఇస్తాయి. పరిమితికి మించి చేసే ఆర్థిక, ఆర్థికేతర సేవలపై చార్జీలు విధిస్తాయి. ఇక ఏటీఎంలలో ఉచిత లావాదేవీల పరిమితి ఖాతా రకం, డెబిట్ కార్డ్‌లపై తేడా ఉంటుంది.
నగదు విత్ డ్రా కోసం బ్యాంకులకు వెళ్లే రోజులు పోయాయి. డబ్బులు వేయాలన్నా.. తీయాలన్నా అంతా ఆన్ లైన్ అయిపోయింది. ఎక్కువగా జనాలు దీనినే వినియోగిస్తున్నారు. లేకుంటే ఏటీఎం(ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్) ద్వారా నగదు తీయడం.. సీడీఎం(క్యాష్ డిపాజిట్ మెషీన్) ద్వారా నగదు వేయడం చేస్తున్నారు. అయితే ఏటీఎంల నుంచి నగదు తీయాలంటే బ్యాంకులు పరిమితులు విధిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని ప్రధాన బ్యాంకులు ప్రతి నెలా పరిమిత సంఖ్యలో ఉచితంగా ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఇస్తాయి. పరిమితికి మించి చేసే ఆర్థిక, ఆర్థికేతర సేవలపై చార్జీలు విధిస్తాయి.
కార్డు రకాన్ని బట్టి..
ఏటీఎంలలో ఉచిత లావాదేవీల పరిమితి.. ఖాతా రకం, డెబిట్ కార్డ్‌లపై తేడా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఛార్జీల వసూళ్లకు సంబంధించిన నిబంధనలు 2022, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం పరిమితికి మించి ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేస్తే ప్రతీ లావాదేవీకి రూ. 21 చార్జ్ చేస్తున్నాయి బ్యాంకులు. ఇంతకు ముందు బ్యాంకులు ప్రతీ లావాదేవీకి రూ. 20 వసూలు చేసేవి.
పరిమితులు ఇలా..
బ్యాంకు వినియోగదారులు ప్రతి నెల వారి బ్యాంక్ ఏటీఎంలలో 5 సార్లు ఉచిత లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 3 సార్లు మాత్రమే ఉచిత లావాదేవీలు చేయడానికి వీలుంటుంది. నాన్ మెట్రో కేంద్రాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎంలలో 5 ఉచిత లావాదేవీలు నిర్వహించవచ్చు.
ఇలా చేయడం ద్వారా చార్జీలు పడకుండా చూసుకోవచ్చు..
- లిక్విడ్ క్యాష్ చెల్లించడానికి ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసే బదులు మీ కార్డ్‌ని స్వైప్ చేయవచ్చు. అనేక మంది వ్యాపారులు, విక్రేతలు ఇప్పుడు కార్డ్ రీడర్‌లను ఉపయోగిస్తున్నారు. ఇది ఏటీఎం లావాదేవీ చార్జీలను ఆదా చేస్తుంది.
- మీ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించండి. సమయానికి అనుగుణంగా.. మీ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా చెల్లింపులను చేస్తే సమయంతో పాటు చార్జీలు తగ్గుతాయి.
- ఏటీఎం లలో ఉచిత విత్ డ్రా అవకాశాలను ఎమర్జెన్సీ సమయంలో వినియోగించుకునేందుకు వీలుగా అట్టిపెట్టుకోవాలి. అవకాశం ఉన్నంత వరకూ మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వినియోగించుకొని బ్యాలెన్స్ ఎంక్వయిరీ, మినీ స్టేట్‌మెంట్‌లు మొదలైన ఆర్థికేతర లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
- ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి మీ బ్యాంక్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోండి. మీ బ్యాంక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని లావాదేవీలు నిర్వహించవచ్చు.
- అవకాశం ఉన్నంత వరకూ మీ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలను మాత్రమే వినియోగించాలి. అప్పుడు అదనపు చార్జీలు లేకుండా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
- అలాగే మీ బ్యాంకు సంబంధించిన నెట్ వర్క్ ఏటీఎంలు ఏమైనా ఉన్నాయేమో వెతకాలి. అంటే మీ బ్యాంకు ఇతర బ్యాంకులు, సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంటే ఆయా సంస్థల ఏటీఎంలలో కూడా ఉచిత విత్ డ్రా కు అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..