Driving tips: డ్రైవింగ్ చేయాలంటే భయమా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలంతే
కొత్త కారు కొనుగోలు చేయాలని, దానిలో దూర ప్రాంతాలకు పర్యటనలకు వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. వివిధ పర్యాటక ప్రాంతాలకు సందర్శించాలని భావిస్తారు. కారును కొనుగోలు చేసే స్థోమత ఉన్నప్పటికీ, దాన్ని డ్రైవింగ్ చేయడానికి కొందరు భయపడతారు. రద్ధీగా ఉండే రోడ్లపై వాహనం నడపడం ఇబ్బందిగా ఉంటుందని, ప్రమాదాలు జరగుతాయని ఆందోళన చెందుతారు.

ఆధునిక కాలంలో అనేక రకాల ఫీచర్లతో కార్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో విడుదలవుతున్నాయి. మాన్యువల్ గేర్ కార్లతో పోల్చితే వీటిని చాలా సులువుగా నడపొచ్చు. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ కారును నడిపే విధానాన్ని ఈ కింద తెలిపిన దశల్లో చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ఆటోమేటిక్ కారును డ్రైవింగ్ చేయడానికి ముందుగా రియర్ వ్యూ, సైడ్ మిర్రర్ లను శుభ్రం చేసుకోవాలి. ముందు వెనుక వచ్చే వాహనాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అలాగే సీటును సరిచేసుకుని బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇక కారులోని గేర్ విభాగానికి సంబంధించి కొన్ని అక్షరాలపై అవగాహన పెంచుకోవాలి.
- పి అనే అక్షరం పార్కింగ్ ను సూచిస్తుంది. ఇది ట్రాన్స్ మిషన్ ను లాక్ చేస్తుంది.
- ఆర్ అంటే రివర్స్. కారును వెనుకకు కదిలించడానికి ఉపయోగపడుతుంది.
- ఎన్ అంటే న్యూట్రల్. గేర్ ఇక్కడ ఉన్నప్పుడు ఇంజిన్ ను చక్రాల నుంచి విడదీస్తుంది.
- డి అంటే డ్రైవింగ్. కారును ముందుకు కదపటానికి బాగా ఉపయోగపడుతుంది.
- గతుకుల రోడ్లు, ఎత్తయిన ప్రదేశాలు వచ్చినప్పుడు గేర్ ను ఎల్ అనే అక్షరం వద్దకు మార్చాలి. రోడ్డు బాగున్నప్పుడు 2, 3 గేర్లకు పెంచుకుంటూ పోవాలి.
ఇంజిన్ స్టార్ చేయడం
కారును స్టార్ చేసే ముందుగా ఇంజిన్ ను ప్రారంభించాలి. కుడి పాదంతో బ్రేక్ ఫెడల్ నొక్కి ఉంచాలి. అనంతరం తాళం తిప్పడం లేదా స్టార్ట్ , స్టాప్ బటన్ ను నొక్కితే ఇంజిన్ ఆన్ అవుతుంది. బ్రేక్ మీద పాదాన్ని అలాగే ఉంచి గేర్ ను దిశ ప్రకారం పి నుంచి డీ లేదా ఆర్ కు తరలించాలి.
డ్రైవింగ్ చేయడం
ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత కారును ముందుకు కదపాలి. దాని కోసం హ్యాండ్ బ్రేక్ ను విడుదల చేసి, బ్రేక్ పై కాలిని నెమ్మదిగా పైకి లేపాలి, దీంతో కారు ముందుకు కదులుతుంది. దీన్నే క్రీప్ మోడ్ అంటారు. అనంతరం యాక్సిలేటర్ ను నొక్కితే కారు వేగం పెరుగుతూ ఉంటుంది.
మలుపులు
రోడ్డుపై కారులో వెళుతున్నప్పుడు మలుపులు, లేన్లు వస్తాయి. మలుపు తిరిగినప్పుడు, లేన్లు మారినప్పుడు సిగ్నల్స్ తప్పకుండా వాడాలి. అప్పడే వెనుక వచ్చే వాహనాలకు మీరు పక్కకు వస్తున్నారని తెలుస్తుంది. సిగ్నల్ ఇవ్వకుండా లేన్ మారితే వెనుక నుంచి వస్తున్న వాహనం ఢీకొనే ప్రమాదం ఉంది.
ఆపడం
కారును స్టార్ట్ చేసి ప్రయాణం ప్రారంభించడంతో పాటు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఆపడం, సురక్షితమైన ప్రాంతంలో పార్కింగ్ చేయడం కూడా చాలా అవసరం. ముందుగా కారును నెమ్మదిగా ఆపండి. కారు ఆగిన తర్వాత గేర్ ను పి కి మార్చండి. సరైన దిశలో ఉంచి హ్యాండ్ బ్రేక్ ఆన్ చేయండి. ఇంజిన్ ఆఫ్ చేయడం కోసం స్టాప్ బటన్ నొక్కండి, లేదా కీని తీసివేయండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








