Pay commission: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు పండగే..జీతం మూడు రెట్ల పెంపు
మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జీవన వ్యయాలు ఏటా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఇంటి అద్దెలు, నిత్యావసరాల ధరలు, కూరగాయలు, ఇతర ఖర్చులు ఎక్కువవుతున్నాయి. అదే సమయంలో వచ్చే ఆదాయం తక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికే కేంద్రం వేతన సంఘాలను ఏర్పాటు చేస్తుంది. వాటి సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల సొమ్ములను పెంచుతుంది.

ఇటీవల 8వ వేతన సంఘం సిఫారసుల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈసారి 2.86 ఫిట్ మెంట్ ఉంటుందని భావిస్తున్నారు. ఇది నిజమైతే వారి బేసిక్ వేతం మూడు రెట్లు పెరుగుతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ద్రవ్యోల్బణం, ఉద్యోగుల అవసరాలు, ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వేతన సంఘం సిఫారసులు చేస్తుంది. దానికి అనుగుణంగా ఉద్యోగుల జీతం, పెన్షన్ ను పెంపుదల చేస్తారు. ప్రస్తుతం 8వ వేతన సంఘంలో ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై అధికార ప్రకటన ఏమీ రాలేదు. కానీ అది 2.60 నుంచి 2.86 మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు బేసిక్ జీతం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది.
సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒక్కసారి వేతన సంఘాలను నియమిస్తారు. వాటి సిఫారసుల ఆధారంగా ఉద్యోగుల జీతాలను పెంచుతారు. ఇలాగే 2006లో 6వ సంఘం, 2016లో 7వ వేతన సంఘాలను ఏర్పాటు చేశారు. 6వ వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మినిమమ్ బేసిక్ జీతం రూ.2750 నుంచి 7 వేలకు, 7వ సంఘం నివేదిక ప్రకారం రూ.7 వేల నుంచి రూ.18 వేలకు పెరిగింది.
మన దేశంలో సుమారు 8 ఏళ్లుగా జీవన వ్యయం బాగా పెరిగిపోయింది. ఢిల్లీ, జైపూర్, భోపాల్, లక్నో వంటి నగరాల్లో ఇంటి అద్దెలు 40 నుంచి 60 శాతం పెరిగాయి. గత పదేళ్లలో ప్రైవేటు పాఠశాలల ఫీజులు 80 శాతం కన్నా ఎక్కువయ్యాయి. ఇక లీటర్ పెట్రోలు ధర రూ.65 నుంచి రూ.100కు పైగా చేరింది. వైద్య ఖర్చులైతే జేబులను ఖాళీ చేస్తున్నాయి. సీజీహెచ్ ఎస్ కవరేజీ ఉన్నప్పటికీ చాలామంది ఇప్పుడు నెలకు రూ.3 వేల నుంచి రూ.పది వేలు ఖర్చు చేస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు ధరల పెరుగుదల గురించి చెప్పనవసరం లేదు.
8వ ఆర్థిక సంఘం నివేదికలో 2.86 ఫిట్ మెంట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు మూల వేతనం రూ.20 వేలు వస్తుందనుకోండి. దాన్ని 2.86 శాతంతో గుణిస్తే రూ.57,200కు చేరుతుంది. అంటే దాదాపు మూడు రెట్లు జీతాలు పెరుగుతాయి. అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే ఆమోదించే అవకాశం ఉందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ తమకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








