ఆరోగ్య బీమాతో ‘మహా భాగ్యం’.. ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్‌‌కు ఎన్నో అన్‌లిమిటెడ్ రీఫిల్స్..

ఆరోగ్యమే మహా భాగ్యం అనే విషయాన్ని అందరూ చెప్పుకుంటారు. కానీ.. ఎంత జాగ్రత్తగా ఉన్నా అనారోగ్యం మన దగ్గరికి రాదు అనే గ్యారెంటీ ఏమీ లేదు. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయీ అంటే అందరూ ఇబ్బంది పడాల్సిందే. అనారోగ్యం తెచ్చే ఇబ్బందులతో రోగి బాధపడితే..

ఆరోగ్య బీమాతో 'మహా భాగ్యం'.. ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్‌‌కు ఎన్నో అన్‌లిమిటెడ్ రీఫిల్స్..
Health Insurance Policy
Follow us
KVD Varma

| Edited By: Ravi Kiran

Updated on: Sep 25, 2023 | 12:00 PM

ఆరోగ్యమే మహా భాగ్యం అనే విషయాన్ని అందరూ చెప్పుకుంటారు. కానీ.. ఎంత జాగ్రత్తగా ఉన్నా అనారోగ్యం మన దగ్గరికి రాదు అనే గ్యారెంటీ ఏమీ లేదు. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయీ అంటే అందరూ ఇబ్బంది పడాల్సిందే. అనారోగ్యం తెచ్చే ఇబ్బందులతో రోగి బాధపడితే.. వారికి సేవలు చేయడానికి.. దానికంటే ఎక్కువగా వారి వైద్య ఖర్చుల కోసం డబ్బు సమకూర్చుకోవడానికి కుటుంబం పడే కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా అనారోగ్యం బారిన పడితే హాస్పిటల్ ఖర్చులను కవర్ చేయడానికే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. కరోనా మహమ్మారి ముందు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి పెద్దగా పట్టించుకునే వారే కాదు. ఇంకా చెప్పాలంటే.. మామూలు ఇన్సూరెన్స్ గురించే ఆలోచించే అలవాటు చాలా మందికి లేదు. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎవరు ధ్యాస పెడతారు చెప్పండి. అయితే, కరోనా తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యత తెలిసి వచ్చింది. దీంతో పాలసీలు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇలా పెరిగినా.. ఇప్పటికీ మన దేశంలో 43 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. నిజానికి కరోనా నేర్పిన పాఠాలతో అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని భావించారు నిపుణులు. అయితే, ఆ దిశలో వేగం మొదట్లో కనిపించినా తరువాత పూర్తిగా తగ్గిపోయింది. హెల్త్ ఇన్సూరెన్స్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా.. ఎందుకు ప్రజలు పాలసీలు తీసుకోవడం లేదు? ఈ విషయాన్ని పరిశీలిద్దాం.

జాతీయ ఆరోగ్య ప్రొఫైల్-2021 ప్రకారం, ఆసుపత్రిలో చేరిన తర్వాత, ఒకేసారి చేసే ఖర్చులలో 80 శాతం కంటే ఎక్కువ మంది వ్యక్తులు తమ సొంత జేబు నుంచి బిల్ పేమెంట్ చేయాల్సి వస్తోంది. దీనిని ‘అవుట్ ఆఫ్ పాకెట్’ వైద్య ఖర్చులు అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ఇటువంటి వైద్య ఖర్చుల కారణంగా, భారతదేశంలో ప్రతి సంవత్సరం 5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదలుగా మారుతున్నారు. ఆరోగ్యంపై పెరుగుతున్న వ్యయం కారణంగా, ప్రతి సంవత్సరం 8-9 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జారిపోతున్నారు.

ఇటీవల కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 40 శాతం ఖరీదైనవిగా మారాయి. ఈ మాట వాస్తవమే అయినా.. ఇదొక్కటే కారణం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే.. కొంత ఎక్కువ ఖర్చు అయినా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం ఏమిటో కరోనా తెలియచెప్పింది. ఎందుకు ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో అశ్రద్ధ చూపిస్తున్నారు అనడానికి ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫిన్ టెక్ కంపెనీ పాలసీ బజార్ సర్వేలో హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుందో తమకు అసలు అర్ధం కాలేదని 19 శాతం మంది చెప్పారు. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా సంక్లిష్టంగా ఉంటుందని అర్ధం అవుతోంది. అవును.. హెల్త్ ఇన్సూరెన్స్ కొద్దిగా అర్ధం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే, హాస్పిటల్ ఖర్చులు కొన్ని పాలసీలు కవర్ చేస్తాయి.. కొన్ని కొన్ని రకాల జబ్బులను మాత్రమే కవర్ చేస్తాయి.. మరికొన్ని పాలసీ తీసుకున్నాకా చాలా కాలం తరువాతే ఫోర్స్ లోకి వస్తాయి.. ఇలా రకరకాల చిక్కు ముడులు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్నాయి.

హెల్త్ ఇన్సూరెన్స్ లో రోజుకో రకం కొత్త పాలసీ అందుబాటులోకి వస్తోంది. ఇందులో ఏపాలసీ తమకు మంచిది అనే విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకోలేకపోతున్నారు. తమ అవసరాలకు తగినడానిని ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ మంది OPD అంటే అవుట్ పేషెంట్ ఖర్చులను కవర్ చేసే విషయంపై ఎక్కువ ఫోకస్ పెడతారు. ఎందుకంటే, ఒంట్లో బాలేదని ఆసుపత్రికి వెళితే.. అనారోగ్యం ఏమిటో తెలడానికి చేసే పరీక్షల ఖర్చులు ముందు బెంబేలు ఎత్తించేలా ఉంటాయి. అందుకే చాలా వరకూ ప్రజలు తొందరగా ఆసుపత్రి మెట్లు ఎక్కరు. ఇక దీని కోసం ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చే పాలసీలు ప్రత్యేకంగా లేవు. రెండు మూడు లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే అందులో OPD ఖర్చులు కవర్ కావు. ఇటువంటి పరిస్థితిలో OPD ఖర్చులు కవర్ కాకపోతే ఇన్సూరెన్స్ ఎందుకు అని చాలా మంది దాని జోలికే పోవడం లేదు. ఇక క్యాన్సర్ వంటి వ్యాధులను కవర్ చేసే పాలసీలు లాకింగ్ పీరియడ్ తో వస్తాయి. కనీసం సంవత్సరం పాలసీ కంటిన్యూ చేస్తేనే ఇటువంటి పెద్ద వ్యాధులకు ఇన్సూరెన్స్ కవర్ వస్తుంది. ఇది కూడా ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ వైపు చూడకుండా చేస్తోంది.

చాలా పాలసీల్లో హాస్పిటల్ లో జాయిన్ అయిన తరువాత రూమ్ రెంట్ కవర్ ఉండదు. అలాగే మన దేశంలో సామాన్యుల సంఖ్య ఎక్కువ. వారు సాధారణ పాలసీలను మాత్రమే కొనాలని చూస్తారు. అయితే ఇటువంటి పాలసీలలో ఏదైనా వ్యాధి చికిత్స కోసం కొంత భాగం జేబు నుంచి పేమెంట్ చేయాల్సి వస్తుంది. దీంతో దీనివలన ఏమి ఉపయోగం ఉందిలే అని వెనకడుగు వేస్తున్నారు.

మరి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రజలకు మరింత చేరువ చేయాలంటే ఏమి చేయాలి? నిపుణులు ఈ ప్రశ్నకు జవాబు ఏమని చెబుతున్నారో చూద్దాం. బీమా కంపెనీలు ప్రీమియం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే పెరుగుతున్న ఖర్చులతో ఆ పని కంపెనీలు చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇక కంపెనీలు ఏజెంట్ల ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముతూ ఉంటాయి. వారికి 20 శాతం వరకూ కమిషన్ ఇస్తాయి. ప్రజలను ఆన్ లైన్ లో ఇన్సూరెన్స్ పాలసీ కొనే వైపుగా ప్రోత్సహించి ఏజెంట్లకు ఇచ్చే కమీషన్ మేర అయినా ప్రీమియం ఖరీదు తక్కువ చేస్తే ప్రజలకు వెసులుబాటు ఉంటుంది. ఇక ప్రభుత్వం కూడా ఆరోగ్య సంజీవని వంటి విధానాల ప్రచారం పెంచడం.. సామాన్యులకు ఇన్సూరెన్స్ విషయంలో అవగాహన కల్పిస్తూనే రాయతీలు ఇవ్వడం వంటివి చేయడం ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ వైపు వారిని ప్రోత్సహించవచ్చు.

ఏది ఏమైనా.. ఆరోగ్యంగానే ఉండాలని అందరూ కోరుకుంటాం.. కానీ, అనారోగ్యం చెప్పిరాదు.. అది చిన్నదైతే ఫర్వాలేదు. లేకపోతే ఇంటిలో ఒక్కరు మంచం పట్టేలా ఆరోగ్య సమస్యలు వచ్చినా కుటుంబం అంతా ఆర్థికంగా దిగజారిపోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.