Health Insurance: మహిళలకు ఆరోగ్య బీమా పాలసీ.. ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!

Health Insurance: ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. స్త్రీ, పురుషులతో సంబంధం లేకుండా బీమా పాలసీ అనేది ఎంతో..

Health Insurance: మహిళలకు ఆరోగ్య బీమా పాలసీ.. ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!
Health Insurance
Follow us
Subhash Goud

|

Updated on: Aug 26, 2021 | 10:04 AM

Health Insurance: ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. స్త్రీ, పురుషులతో సంబంధం లేకుండా బీమా పాలసీ అనేది ఎంతో అవసరం. ఒకప్పుడు ఆరోగ్య పాలసీలు చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది పాలసీలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే రోజురోజుకు వివిధ రకాల వ్యాధులు చుట్టుముట్టేయడం.. వైద్య ఖర్చులు అమాంతం పెరుగుతుండటం కారణంగా పాలసీలు చేసుకునేవారు పెరిగిపోతున్నారు. ఇక మధ్య కాలంలో మహిళలు కూడా ఆరోగ్య బీమాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మహిళా బీమాకు ప్రజాదరణ పెరుగుతోంది. మహిళల కోసం అనేక రకాల ఇన్సూరెన్స్‌ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. పాలసీలు తీసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది.

ప్రస్తుతమున్న రోజుల్లో పురుషులతో పాటు మహిళలకు కూడా ఎన్నో రకాల వ్యాధులు ఉంటున్నాయి. పాలసీలు కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కవర్‌ చేస్తాయి. అలాంటి విషయాలు కొందరికి తెలియకపోవచ్చు. అలాంటి సమయంలో పాలసీలు తీసుకునే ముందు మీకు ఉన్న వ్యాధుల గురించి ముందుగానే తెలియజేయడం మంచిది. అలాగే కుటుంబ ఆరోగ్య బీమాలో లేదా సంస్థ అందించే బృంద పాలసీలో సభ్యులుగా ఉన్నాం కదా అని సరిపెట్టుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. ప్రత్యేకించి మహిళలకే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. రొమ్ము క్యాన్సర్‌, ఆర్థరైటిస్, ఓవేరియన్ పాలీసిస్టోసిస్ లాంటి సమస్యలు మహిళలకే ఎక్కువ ఉంటాయి. అలాగే అధిక రక్తపోటు, థైరాయిడ్‌, ఆస్తమా, క్యాన్సర్‌, మధుమేహం వంటి తదితర వ్యాధుల ఇన్సూరెన్స్‌ కవర్‌ అవుతుంటాయి.

గర్భవతిగా ఉన్నప్పుడు..

గర్భవతిగా ఉన్నప్పుడు, పిల్లలను కన్న తర్వాత అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురవుతుంటారు. స్త్రీల సమస్యలను అర్థం చేసుకున్న బీమా సంస్థలు వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పాలసీలు రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చాయి. మహిళలూ చొరవ తీసుకొని ఇలాంటి పాలసీ తీసుకోవడం మంచిది. అలాగే వైద్య ఖర్చుల విషయాలలో కొన్ని పాలసీల నిబంధనలు వేరుగా ఉంటాయి. కొన్ని పాలసీలు మీరు ముందుగానే వైద్య ఖర్చులు భరించిన తర్వాత ఆ మొత్తం క్లెయిమ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. మరి కొన్ని పాలసీలు మీరు ఎలాంటి ఖర్చులు పెట్టుకోకుండానే పాలసీ కంపెనీలే క్లెయిమ్‌ చేసుకుంటాయి. ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది.

పాలసీ ప్రయోజనాలు..

మహిళల జీవితంలో కీలక దశ అయిన ప్రసూతి సమయంలో కలిగే వైద్య ఖర్చులకు బీమా తోడ్పాటు అందిస్తుంది. అయితే, వీటికి 2-4 ఏళ్ల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని గమనించాలి. పిల్లలు అనారోగ్య సమస్యలతో జన్మించినా ఈ బీమా రక్షణగా ఉంటుంది.

తీవ్ర అనారోగ్య సమస్యలకు…

21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు వరకు ఉన్న మహిళలు ఈ పాలసీలు తీసుకునే అవకాశం ఉంది. అధిక అనారోగ్య సమస్యలైన గర్భాశయ క్యాన్సర్‌, పక్షవాతం, కీళ్ల సమస్యలు వంటి వాటికి బీమా కల్పిస్తారు. ఇలాంటి సమయంలో ఆర్థిక భారం పడకుండా ఈ పాలసీలు ఎంతగానో ఉపయోగపడతాయి. పాలసీ తీసుకున్న మొదటి 90 రోజుల్లోనే తీవ్ర అనారోగ్య సమస్యలకు గురైనట్లు గుర్తిస్తే ఆ సమయంలో బీమా వర్తించదు (వెయిటింగ్ పీరియడ్‌).

పెద్ద వయసులో కూడా ..

కొన్ని పాలసీలు జీవితకాలం పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తే, కొన్ని వయో పరిమితి విధిస్తున్నాయి. పాలసీ పరిధిలోకి వచ్చే అంశాలు చాలా ఉంటాయి. అవేంటంటే.. రోజూ వారి ఆసుపత్రి ఖర్చులు, ఐసీయులో చేరితే అందుకయ్యే ఖర్చులు, ప్రమాదం కారణంగా కలిగే గాయాలకు చేసే కాస్మోటిక్ శస్ర్త చికిత్సలకు అయ్యే ఖర్చులను బీమా కంపెనీలు చెల్లిస్తాయి. అలాగే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక సాధారణ ఆరోగ్య స్థితికి చేరుకునే వరకూ అయ్యే ఖర్చులకు బీమా వర్తిస్తుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక చికిత్సకయ్యే మందులకు, నర్సింగ్ చార్జీలు బీమా కంపెనీలు చెల్లిస్తాయి. ఇలాంటి విషయాలు మహిళలు ముందుగానే తెలుసుకోవడం మంచిది. పాలసీలు తీసుకునే ముందు మీరు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోవాలి. మీరు మర్చిపోకుండా ఉండేందుకు ఒక పేపర్‌పై మీకు ఉన్న అనుమానాలను రాసుకోవడం బెటర్‌. పాలసీ తీసుకునే ముందు వివరంగా వివరాలు అడిగి తెలుసుకోవాలి.

ఇవీ కూడా చదవండి:

Reserve Bank Of India: మరో సహకార బ్యాంకుకు భారీ జరిమానా విధించిన రిజర్వ్‌ బ్యాంకు.. కారణం ఇదే..!

ATM Fine: ఏటీఎంల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు.. అదేంటంటే..