Delivery Charges: తగ్గనున్న డెలివరీ ఛార్జీలు.. స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ వాడేవారికి కేంద్రం భారీ ఊరట..!
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేవారికి గుడ్ న్యూస్. డెలివరీ ఛార్జీలు భారీగా తగ్గనున్నాయి. ఇప్పటివరకు ఫుడ్ డెలివరీపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నాయి. ఇప్పుడు దానిని కేంద్రం భారీ తగ్గించనుంది. దీంతో ప్రజలపై భారం తగ్గనుందని చెప్పచ్చు. ఎంత వరకు తగ్గించనున్నారంటే..

స్విగ్గి, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్, ఈ-కామర్స్ యాప్స్ ఉపయోగించేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించే యోచనలో ఉంది. ప్రస్తుతం డెలివరీ ఛార్జీలపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం వినియోగదారుల నుంచి వసూలు చేసే డెలివరీ చార్జీలపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అయితే దీనిని 5 శాతంగా చేయాలని కేంద్రం భావిస్తోంది. డెలివరీ ఛార్జీలు తగ్గడం వల్ల ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే ప్రజలకు పెద్ద ఉపశమనం కలగనుంది. అలాగే ఈ-కామర్స్ వెబ్ సైట్ల ద్వారా వస్తువులు ఆర్డర్ చేసుకునేవారికి కూడా ఉపయోగకరంగా ఉండనుంది.
జీఎస్టీ 57వ సమావేశం అక్టోబర్ 8వ తేదీన జరగనుంది. పన్ను రేట్లలో మార్పులు, నిబంధనలు సలుభతరం చేయడం, పలు పరిశ్రమలలో ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్(ITC) అంశాలపై చర్చించనున్నారు. జీఎస్టీ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ యాప్స్‌లలో డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ తగ్గించనున్నారు. పలు స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్స్‌లో డెలివరీ చేసే ఆహారంపై 5 శాతం జీఎస్టీ రేటు విధిస్తుండగా.. వినియోగదారుల నుంచి వసూలు చేసే డెలివరీ ఛార్జీలపై 18 శాతం జీఎస్టీ ఉంది. ఇప్పుడు కస్టమర్ల డెలివరీ ఛార్జీలను 5 శాతం జీఎస్టీ స్లాబ్ కిందకు తీసుకురావడం వల్ల వ్యత్యాసం తగ్గుతుంది. దీని వల్ల డెలివరీ ఛార్జీలు చౌకగా మారనున్నాయి. రేపు జరగనున్న జీఎస్టీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, ఫిట్‌నెస్ సెంటర్లకు ఐటీసీని అనుమతించే నిర్ణయానికి ఆమోదముద్ర వేయనున్నారు.
ఈవీ రవాణా, అద్దె సేవల కోసం రెండు పన్ను విధానాలను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తోంది. ఐటీసీతో కూడిన 5 శాతం జీఎస్టీ రాయితీ లేదా పూర్తి ఐటీసీ ప్రయోజనాలతో కూడిన 18 శాతం జీఎస్టీ అంశాలను పరిశీలిస్తోంది. ఇక ఎయిర్/వాటర్ ప్యూరిఫైయర్లు, క్రూయిజ్ టూరిజం రెండింటిపైనా 18 శాతం జీఎస్టీ రేటు కొనసాగించనున్నారు. ప్రత్యేకమైన, ప్రాణరక్షక చికిత్సలకు సంబంధించి మరో ఏడు అరుదైన వ్యాధులను జీఎస్టీ మినహాయింపు జాబితాలో చేర్చనున్నరని తెలుస్తోంది. వ్యవసాయ విత్తనాల నిల్వ, వేర్‌హౌసింగ్ సేవలకు జీఎస్టీ మినహాయింపులు ఇవ్వాలని చూస్తున్నారు. NBFC-బ్యాంకు సహ-రుణ భాగస్వామ్యాలకు GST వర్తింపుపై కౌన్సిల్ అధికారిక వివరణలు జారీ చేస్తుందని భావిస్తున్నారు. ఇక నామినేటెడ్ ఏజెన్సీలు, బ్యాంకుల ద్వారా జరిగే బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై 3 శాతం ఐజీఎస్టీ విధించాలని చూస్తున్నాయి. అయితే విలువైన లోహాలపై ఉన్న ప్రస్తుత ఐజీఎస్టీ మినహాయింపును తొలగించే అంశంపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
