AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Repo Rate: రూ.50 లక్షల హోం లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ ఎంత పెరుగుతుంది..? సామాన్యులపై భారం..

ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చింది. దీంతో హోం, పర్సనల్ లోన్ వడ్డీ రేట్ల పెరగనున్నాయి. అలాగే ఫ్లోటింగ్ రేటతో రుణాలు తీసుకున్నవారికి ఈఎంఐ పెరగనుంది. దీంతో నెలవారీ అదనపు భారం పడనుంది.

RBI Repo Rate: రూ.50 లక్షల హోం లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ ఎంత పెరుగుతుంది..? సామాన్యులపై భారం..
Rbi Rates
Sukumaar DG - Associate Editor
| Edited By: |

Updated on: Oct 07, 2026 | 11:30 AM

Share

దసరా సందర్భంగా సామాన్యులకు ​రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంది. బుధవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తన ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. లోన్ వడ్డీతో రెపో రేటు అనుసంధానించబడి ఉంటుంది. దీంతో రెపో రేటు పెరగడం వల్ల బ్యాంకులు ఇచ్చే వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెరిగనున్నాయి. ఆర్బీఐ ప్రకటించడంతో ప్రభత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ వడ్డీ రేట్ల పెంపుపై రాబోయే రోజుల్లో ప్రకటన చేయనున్నాయి. దీంతో రుణగ్రహీతలపై నేరుగా ఈఎంఐ భారం పడనుంది. ఎక్కువగా హోమ్ లోన్లు వంటివి ఫ్లోటింగ్ రేట్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ అయిన రెపో రేటుతో ముడిపడి ఉంటాయి. ఈ రుణాలు ప్రతి మూడు నెలలకోసారి రీసెట్ అవుతాయి. దీంతో తాజా రేట్ల పెంపు ప్రభావం కొత్త రుణగ్రహీతలపై వెంటనే కనిపించనుది తెలుస్తోంది.

ఆర్బీఐ నిర్ణయం వల్ల రూ.50 లక్షల హోమ్ లోన్‌ను 20 ఏళ్ల కాలపరిమితితో తీసుకున్న వారికి నెలకు అదనంగా రూ.780 వరకు ఈఎంఐ భారం పడనుంది. పాత ఎంసీఎల్ఆర్ రుణాల రీసెట్ గడువు ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉండటంతో వారిపై ఈ భారం కాస్త ఆలస్యంగా బదిలీ అవుతుందని చెప్పవచ్చు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కవుగా హోం లోన్ తీసుకుంటారు. తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు బ్యాంకుల నుంచి గృహ రుణాలు తీసుకుంటారు. దీంతో ఆర్బీఐ నిర్ణయం నేరుగా  సామాన్యులపై ప్రభావం చూపించనుంది. అయితే బ్యాంకులు రుణగ్రహీతలకు రెండు ఆప్షన్లు ఇచ్చే వీలుంది. ఒకటి నెలవారీ ఈఎంఐ పెంచడం లేదా లోన్ కాలపరిమితిని పొడిగించడం. అయితే కాలపరిమితి పెంచితే దీర్ఘకాలంలో వడ్డీ భారం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్లోటింగ్ రేటుతో హోమ్ లోన్ తీసుకున్నవారికి ఈఎంఐల పెరగనుండగా.. ఫిక్స్‌డ్ రేట్ రుణాలు తీసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఫ్లోటింగ్ రేట్ ఉన్నవారు తమ లోన్ స్టేట్‌మెంట్లను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రిపేమెంట్స్ చేయడం ద్వారా అదనపు వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగడంతో వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచినట్లు తెలుస్తోంది. దేశీయ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేయాల్సి వచ్చిందని సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల కోత ఉండబోదని ఆర్బీఐ గవర్నర్ కుండబద్దలు కొట్టారు.

Follow Us