GST Council Meeting: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వాటిపై జీఎస్టీ తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం.. వీటి ధరలు తగ్గింపు
ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారమన్ నేతృత్వంలో జరిగిన ఈ జీఎస్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు...
ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారమన్ నేతృత్వంలో జరిగిన ఈ జీఎస్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్టేషనరీపై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో స్టేషనరీ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. పెన్సిల్, షార్ప్‌నర్లపై జీఎస్టీ తగ్గించింది కేంద్రం. అలాగే రాష్ట్రాలకు జూన్ వరకు ఉన్న బకాయిలను చెల్లించేందుకు కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. రూ.16,982 కోట్లు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే మొత్తం నిధులు అందుబాటులో లేనప్పటికీ తమ సొంత వనరుల నుండి నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
దీంతో 2017 జీఎస్టీ చట్టం ప్రకారం ఐదేళ్ల కాలానికి చెల్లించాల్సిన మొత్తం పరిహారాన్ని చెల్లించినట్లేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిహార బకాయిల కింద ఏపీకి రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.548 కోట్లు రానున్నాయి. 2022-23 సంవత్సరానికి సంబంధించి జీఎస్టీఆర్-9 దాఖలు విషయంలో ఆలస్య రుసుమును హేతుబద్ధీకరించారు. రూ.5 కోట్ల వరకు ఆలస్య రుసుమును రోజుకు రూ.50 గానూ, రూ.50-20 కోట్ల టర్నోవర్ కలిగిన వారికి రోజుకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫీజు రూ.200గా ఉంది.
దీంతో దేశంలో పెన్సిల్, షార్పనర్ తదితర స్టేషనరీ వస్తువుల ధరలు దిగిరానున్నాయి. అలాగే ఆలస్యంగా జీఎస్టీ ఫైల్ చేస్తే విధించే పెనాల్టీని సవరించాలని కౌన్సిల్‌లో నిర్ణయించినట్లు మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌పై చర్చలు జరిపామని, దీనిలో ఇద్దరు న్యాయమూర్తులు ఉండాలని ప్రతిపాదించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కంటైనర్లకు అతికించే ట్యాగ్‌లు, ట్రాకింగ్ పరికరాలు, డేటా లాగర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి సున్నాకు తగ్గించగా.. బెల్లం పాకంపై 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి వెల్లడించారు.
2017లో అమలు జీఎస్టీ.. జీఎస్టీ రిలీఫ్ చట్టం కేంద్ర ప్రభుత్వం సెస్ విధించడానికి అనుమతిస్తుంది. జూలై 1 , 2017 నుండి జిఎస్‌టి అమలులోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ నష్టాన్ని ప్రభుత్వం ఇప్పుడు భర్తీ చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి