India Post: ఎలాంటి రిస్క్ లేకుండా రూ.7 లక్షలు కావాలా? ఇంతకు మించిన మార్గం లేదు!
ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ, ఇండియా పోస్ట్ RPLI లోని గ్రామ ప్రియా పథకం సురక్షిత పెట్టుబడిగా నిలుస్తుంది. ఈ మనీ-బ్యాక్ పాలసీ, హామీతో కూడిన రాబడితో పాటు రూ.7.25 లక్షల వరకు మెచ్యూరిటీ, జీవ బీమా రక్షణను అందిస్తుంది. నెలకు రూ.5,042 ప్రీమియంతో 10 సంవత్సరాలలో ఆర్థిక భద్రత పొందవచ్చు.

ద్రవ్యోల్బణం పెరుగుతున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో భద్రతతో కూడిన పెట్టుబడులపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు ఎక్కువ రాబడి ఇచ్చినా వాటిలో ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పథకాల వైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు. అలాంటి పథకాలలో ఇండియా పోస్ట్ నిర్వహిస్తున్న గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI)లోని గ్రామ ప్రియా పథకం ఒక ఆకర్షణీయ ఎంపికగా నిలుస్తోంది.
ఈ మనీ-బ్యాక్ పాలసీ పెట్టుబడికి భద్రతను ఇవ్వడంతో పాటు హామీ బోనస్ ప్రయోజనాన్ని అందిస్తుంది. పథకం కాలపరిమితి 10 సంవత్సరాలు. ఉదాహరణకు, నెలకు సుమారు రూ.5,042 ప్రీమియం చెల్లిస్తే, కాలపరిమితి ముగిసే సమయానికి సుమారు రూ.7.25 లక్షల వరకు మెచ్యూరిటీ కార్పస్ పొందే అవకాశం ఉందని పోస్టల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పథకంలో కనీస బీమా మొత్తం రూ.10,000 కాగా, గరిష్టంగా రూ.5 లక్షల వరకు తీసుకోవచ్చు. ప్రతి రూ.1,000 బీమాపై సంవత్సరానికి రూ.45 బోనస్ ప్రకటించబడింది. అంటే రూ.5 లక్షల పాలసీపై వార్షిక బోనస్ రూ.22,500 వరకు వస్తుంది. 10 సంవత్సరాల్లో ఇది గణనీయంగా పెరిగి మెచ్యూరిటీ మొత్తాన్ని బలపరుస్తుంది.
గ్రామ ప్రియా పథకం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, జీవ బీమా రక్షణ కూడా అందిస్తుంది. పాలసీ కాలంలో పాలసీదారుడు మరణిస్తే, మొత్తం హామీ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. దీంతో కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఇది దీర్ఘకాల నిబద్ధత కలిగిన పథకం కాబట్టి ప్రీమియంలను క్రమం తప్పకుండా చెల్లించాలి. మధ్యలో ఆపేస్తే పాలసీ లాప్స్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ముందస్తు ఉపసంహరణ అవకాశాలు పరిమితంగా ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
