Gold Price: 2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే.. ? వింటే షాకింగే
బంగారం ధరలు ఇప్పటికే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. బ్రేకులు లేకుండా ధరలు జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే లక్షన్నరకు చేరుకున్న బంగారం.. ఏడాది చివరి వరకు మరింత పెరగనుంది. ఇక వచ్చే ఏడాది మరింత పెరగొచ్చనే అంచనాలు వస్తున్నాయి.

Gold Rates india: బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది రికార్డులు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక పరిణామాలతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గిపోవడంతో గోల్డ్ రేట్ పరుగులు పడుతోంది. ఏకంగా తులం బంగారం లక్షన్నరకు చేరుకోగా.. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను బట్టి చూస్తుంటే ఈ ఏడాది చివరి వరకు మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తులోకి గోల్డ్ రేటు చేరుకుంది. బంగారం కొనుగోలు చేయాలనే ఆలోచన వస్తేనే భయపడేంతగా ధరలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి.
ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల ఏకంగా కేజీ వెండి రెండు లక్షల మార్క్‌కి చేరుకుని ఆల్ టైం గరిష్ట రికార్డ్ నమోదు చేసింది. అంతర్జాతీయంగా డిమాండ్‌కు తగ్గట్లు వెండి సరఫరా లేకపోవడమే ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఇదే క్రమంలో మరో వార్త గుబులు పుట్టిస్తోంది. 2026లో బంగారం ధరలు ఏకంగా 5 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్ధిక అస్థిరత క్రమంలో ప్రపంచవ్యాప్తంగా గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేసేవారు ఎక్కువైపోయారు. ధరల పెరుగుతాయని అనడానికి అదే పెద్ద కారణంగా విశ్లేషిస్తున్నారు.
అంతర్జాతీయంగా ఆర్ధిక అస్థిరత తారాస్థాయికి చేరుకుంటోంది. యుద్దాల వల్ల ఆర్ధిక మాంద్యం దెబ్బతినడం, టారిఫ్‌ల పేరుతో ఆందోళనకర పరిస్థితులు, అంతర్జాతీయంగా పెరుగుతున్న అప్పు గోల్డ్ రేట్ల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.ఇక ఇండియా విషయానికొస్తే.. డాలర్‌తో రూపాయి విలువ డిసెంబర్‌లో భారీగా తగ్గింది. డాలర్‌తో రూపాయి విలువ రూ.90.20కి చేరుకుంది. దీని వల్ల భారత్‌లో బంగారం రేట్లు పెరగనున్నాయి. రూపాయి విలువ పతనమవ్వడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం ధర పెరుగుతోంది. ఇక ఈ పరిస్థితుల క్రమంలో ఆర్‌బీఐ కూడా బంగారు నిల్వలను పెంచుకుంటోంది. ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు 64 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో మొత్తం నిల్వలు 880.2కి చేరుకున్నాయి. ఇక అన్ని దేశాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.




