Gold Rates: తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న బంగారం ధరలు! ఈ సమయంలో కొనొచ్చా?
గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో మళ్లీ కొద్దిగా పెరుగుదల కనిపించింది. దీంతో పెట్టబడి దారుల్లో కన్ ఫ్యూజన్ నెలకొంది. అసలు ఈ ట్రెండ్ ను ఎలా చూడాలి? ఈ సమయంలో బంగారం లేదా వెండి కొనొచ్చా? నిపుణులు ఏమంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం బంగారం ధర (10 గ్రాములకు) రూ.1,18,461 వద్ద ట్రేడ్ అవ్వగా.. బుధవారం నాటికి కొద్దిగా పెరిగి పెరిగి రూ.1,21,580 కి చేరుకుంది. గత రెండు నెలలుగా ర్యాలీ అవుతున్న బంగారం ధరల కారణంగా వాటి అమ్మకాలు కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయి. దీంతోపాటు కొన్ని అంతర్జాతీయ పరిస్థితులు కూడా ప్రభావితం చేయడంతో ధరల్లో తగ్గుదల కనిపించిందని నిపుణులు చెప్తున్నారు. అలాగే ధరల్లో ఈ స్వల్పకాలిక హెచ్చుతగ్గులను దిద్దుబాటుగా మాత్రమే చూడాలని ఇది దీర్ఘకాలిక ట్రెండ్ కాదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కారణాలు ఇవే..
ప్రపంచ వాణిజ్యంలో వస్తున్న మార్పులు, గాజా శాంతి చర్చల వంటి కారణాల వల్ల భౌగోళిక రాజకీయ ఆందోళనలు కాస్త తగ్గాయి. దాంతో బంగారం ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది. త్వరలోనే అమెరికా బ్యాంకుల సమావేశం జరగనుంది. అందులో జరిగే వాణిజ్య చర్చలు, విధాన ప్రకటనల ఆధారంగా ట్రెండ్ మళ్లీ మారొచ్చు. అలాగే అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కూడా ఈ ధరలపై బలమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం కొనొచ్చా?
బంగారం ధరల్లో కనిపిస్తున్న ఈ హెచ్చుతగ్గులు తాత్కాలికమే అని లాంగ్ టర్మ్ ట్రెండ్ కింద పరిగణించకూడదని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితులు తలెత్తితే ధరలు మళ్లీ బలపడవచ్చు అంటున్నారు. అయితే షార్ట్ టర్మ్ పెట్టుబడిగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఈ ట్రెండ్ లను జాగ్రత్తగా గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద కొనుగోలు చేసేవాళ్లు ఈ ట్రెండ్స్ పట్టించుకోవాల్సిన పని లేదని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైమైనా పెట్టుబడి పెట్టేముందు మీరు నమ్మదగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
